అమరావతి, ఆగస్టు 4: నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జల్ జీవన్ మిషన్ పనులను మరింత వేగవంతం చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమలవుతున్న జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పురోగతిపై మంగళవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల తీర ప్రాంత గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రూ.3,050 కోట్ల వ్యయంతో చేపట్టిన అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా సుమారు 33 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నట్లు తెలిపారు. కీలక నిర్మాణాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
అమరజీవి జలధార ప్రాజెక్టు కింద ప్రస్తుతం సుమారు రూ.270 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని అధికారులు సమావేశంలో పవన్ కల్యాణ్ వివరించారు. ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు, యాక్సెస్ బ్రిడ్జిల నిర్మాణంతో పాటు పైప్‌లైన్ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.
400 కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్ పూర్తి
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రూ.1,650 కోట్లతో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకం ద్వారా 10 నియోజకవర్గాల్లో సుమారు 20 లక్షల మందికి తాగునీరు అందించనున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో రెండు ఇన్‌టేక్ వెల్స్, యాక్సెస్ బ్రిడ్జిల నిర్మాణంతో పాటు 111 ఎంఎల్‌డీ, 75 ఎంఎల్‌డీ సామర్థ్యాల నీటి శుద్ధి కేంద్రాల పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 182 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తయిందన్నారు.
అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1,400 కోట్లతో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ ద్వారా 13.50 లక్షల మందికి తాగునీరు అందించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇన్‌టేక్ వెల్, యాక్సెస్ బ్రిడ్జి, 155 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. రెండు ప్రాజెక్టుల కింద కలిపి 400 కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్ నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలిపారు.
పెండింగ్ అనుమతులు త్వరగా పూర్తి చేయాలి
పైప్‌లైన్ నిర్మాణానికి సంబంధించి రోడ్లు, జాతీయ రహదారులు, పంచాయతీరాజ్, అటవీ శాఖల అనుమతులు పెండింగ్‌లో ఉంటే వెంటనే పూర్తి చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. అన్ని శాఖల మధ్య సమన్వయంతో పనులు గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లు పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించి రాష్ట్ర కార్యాలయానికి నివేదికలు పంపాలని ఆదేశించారు.
నిర్మాణ పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యతలో రాజీ పడవద్దని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ పనులను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి గ్రామీణ కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.





















