Police Recruitment | హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) పోలీసు నియామక–2026 ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 19వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేసింది.
పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో మొత్తం 7,437 ఖాళీలను భర్తీకి జూలై 29న మొత్తం నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి తాజాగా దరఖాస్తుల షెడ్యూల్‌ను విడుదల చేసింది. దరఖాస్తు ఫీజు ఒక్కసారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని.. మొత్తం నియామక ప్రక్రియకు అదే వర్తిస్తుందని తెలిపింది. ఇందులో దరఖాస్తు ప్రాసెసింగ్, ప్రిలిమినరీ రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్షలు, తుది రాత పరీక్ష, బయోమెట్రిక్ నమోదు, ఫలితాల ప్రాసెసింగ్ తదితర ఖర్చులు ఉంటాయని వివరించింది.
సబ్ ఇన్‌స్పెక్టర్, రిజర్వ్ ఎస్‌ఐ, ఎస్‌పీఎఫ్ ఎస్‌ఐ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టులకు తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750, ఇతరులకు రూ.1,500గా ఫీజు నిర్ణయించినట్లు తెలిపింది. పోలీసు కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, వార్డర్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600, ఇతరులకు రూ.1,200 ఫీజుగా ఉంటుందని పేర్కొంది. ఒకటి కంటే ఎక్కువ కామన్ ప్రొసీజర్ రెజిమెన్‌ల కింద పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు శారీరక పరీక్ష ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తామని, అదనంగా దరఖాస్తు చేసే ప్రతి రెజిమెన్‌కు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50 చొప్పున ఫీజులో రాయితీ కల్పిస్తామని బోర్డు వెల్లడించింది.
దరఖాస్తు చేసుకునే ముందు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ కోసం మొబైల్‌లో ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు సమర్పించిన తర్వాత దాని ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలని, సందేహాల నివృత్తి కోసం టీజీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లోని హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని బోర్డు సూచించింది.





















