Star Explosion | సూర్యుడి కంటే దాదాపు 30 రెట్లు భారీగా ఉన్న ఓ నక్షత్రం పేలిపోయి అంతరించిపోయే క్రమాన్ని శాస్త్రవేత్తలు తొలిసారి పరిశీలించారు. నక్షత్రం లోపలి భాగం కుప్పకూలుతున్న సమయంలో ఏర్పడిన శక్తిమంతమైన షాక్ వేవ్ దాని ఉపరితలాన్ని చీల్చుకుని బయటకు వచ్చిన దృశ్యాన్ని సైతం గుర్తించారు. ఈ ప్రక్రియను ‘షాక్ బ్రేకౌట్’గా పిలుస్తారు. చైనాకు చెందిన ‘ఐన్‌స్టీన్ ప్రోబ్’ అంతరిక్ష టెలిస్కోప్ ఈ ఘటనలో వెలువడిన స్వల్పకాలిక ఎక్స్‌రే కాంతి మెరుపును గుర్తించింది. మార్చి నుంచి ఈ పేలుడును శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. నక్షత్రం కుప్పకూలుతున్న కోర్ నుంచి వెలువడిన షాక్ వేవ్.. దాని బయటి పొరలను చీల్చుకుని బయటకు రావడంతో ఈ ఎక్స్‌రే ఫ్లాష్ ఏర్పడినట్లు గుర్తించారు. సూపర్‌నోవా పేలుళ్లలో ‘షాక్ బ్రేకౌట్’ జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇది చాలా స్వల్ప సమయంలోనే చోటుచేసుకుంటుంది. దీంతో దాన్ని గుర్తించడం చాలా కష్టం. 2008 తర్వాత ఇలాంటి ఘటనను గుర్తించడం ఇదే తొలిసారి. సరైన సమయంలో ఈ దృశ్యాన్ని పట్టుకోవడం అదృష్టంతో కూడుకున్న విషయమని అమెరికాలోని కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త బ్రెండన్ ఓ’కానర్ తెలిపారు. సూపర్‌నోవాపై ‘ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్’లో ప్రచురితమైన రెండు పరిశోధనల్లో ఒకదానికి ఆయన ప్రధాన రచయిత.
రాడార్‌లా షాక్ వేవ్
షాక్ వేవ్‌ను రాడార్‌తో పోల్చవచ్చని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త జిలియన్ రాస్టినెజాడ్ తెలిపారు. షాక్ వేవ్ నక్షత్రం బయటి పొరలు, దాని చుట్టూ ఉన్న పదార్థం గుండా ప్రయాణిస్తున్నప్పుడు సంకేతాలను వదులుతుంది. అవి ఎక్స్‌రే కిరణాల రూపంలో గుర్తించవచ్చని వివరించారు. ఈ ఎక్స్‌రేల ఆధారంగా నక్షత్రం కుప్పకూలడానికి ముందు ఉన్న పరిస్థితులను శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. నక్షత్రం అంతిమ దశకు చేరుకునే ప్రక్రియపై ఇంతకు ముందు లభించని కీలక సమాచారాన్ని ఈ పరిశీలన అందించింది. ఈ సూపర్‌నోవా పేలుడు భూమికి సుమారు 500 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోని ఓ గెలాక్సీలో సంభవించింది. ఒక కాంతి సంవత్సరం అంటే కాంతి ఏడాదిలో ప్రయాణించే దూరం. ఇది దాదాపు 9.5 ట్రిలియన్ కిలోమీటర్లకు సమానం. ఈ ఘటనను గుర్తించేందుకు పలు టెలిస్కోప్‌లను ఉపయోగించారు. పరిశీలనల ఆధారంగా పేలుడుకు ముందు ఆ నక్షత్రం సూర్యుడి కంటే దాదాపు 30 రెట్లు భారీగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
బ్లాక్‌హోల్‌గా మారిందా?
పేలుడు తర్వాత ఆ నక్షత్రం బ్లాక్‌హోల్‌గా మారి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అత్యంత సాంద్రత కలిగిన బ్లాక్‌హోల్‌కు విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. దాని నుంచి కాంతి కూడా బయటకు రాలేని స్థాయిలో అది ఉంటుంది. పేలుడుకు ముందు ఈ నక్షత్రం ‘వుల్ఫ్-రేయెట్ స్టార్’గా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఇవి అత్యంత భారీ, అరుదైన నక్షత్రాలు. శక్తిమంతమైన నక్షత్ర గాలుల కారణంగా వీటి బయటి పొరల్లోని హైడ్రోజన్, హీలియం అంతరిక్షంలోకి వెలువడుతుంటాయి. ఇలాంటి నక్షత్రం సూపర్‌నోవాగా పేలిపోయే సమయంలో ఏర్పడిన ‘షాక్ బ్రేకౌట్’ను ఇంత స్పష్టంగా గుర్తించడం ఇదే తొలిసారి. నక్షత్రాల అంతిమ దశ, వాటి కుప్పకూలే ప్రక్రియ, బ్లాక్‌హోల్ ఏర్పాటుపై మరింత అవగాహనకు ఈ పరిశీలన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.




















