నేపాల్‌లో భారీ వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుండగా.. మరోవైపు వరదల సమయంలో జరిగిన షాకింగ్ నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. త్రిశూలీ నదిలో కొట్టుకొచ్చిన ఓ బ్యాంక్ సేఫ్‌ను కొందరు స్థానికులు పగులగొట్టి అందులోని నగదును తీసుకున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
సెప్టెంబర్ 10న రాసువా జిల్లాలోని భోటేకోషి ప్రాంతంలో భారీ వరదలకు ఓ నగదు సేఫ్ కొట్టుకుపోయింది. అనంతరం ధాడింగ్ జిల్లాలోని గల్చీ గ్రామీణ మున్సిపాలిటీ-4 పరిధిలో బెల్‌ఖుఖోలా సమీపంలో త్రిశూలీ నది ఒడ్డున అది కనిపించింది. సెప్టెంబర్ 12న కొందరు స్థానికులు సేఫ్‌ను పగులగొట్టి అందులోని నగదును తీసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.92,68,505 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఎవరిది? సేఫ్‌లో వాస్తవంగా ఎంత మొత్తం ఉండేది? ఈ ఘటనలో మరెవరైనా పాల్గొన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహం నుంచి బంగారు పోగులు చోరీ
ఇదే సమయంలో నేపాల్‌లో మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణి నదిలో వరదలకు కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహం నుంచి బంగారు చెవి పోగులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. వీడియో ఆధారంగా ఇద్దరిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.
భారీ వరదలతో ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పోరాడుతున్న సమయంలో.. కొందరు బాధితుల ఆస్తులను దోచుకోవడం, మృతదేహాల పట్ల అమానవీయంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.




















