వరద ముంచెత్తేలోపే మాస్టర్ ప్లాన్.. 1643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్‌మాస్టర్

నేపాల్‌లో భారీ వరదల వేళ ఓ హెడ్‌మాస్టర్ చూపిన సమయస్ఫూర్తి 1643 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడింది. వరద ముప్పు ఉందని సమాచారం అందుకున్న వెంటనే ఉపాధ్యాయులను అప్రమత్తం చేసి, విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పిల్లలు సురక్షిత ప్రాంతానికి చేరుకున్న కొద్ది నిమిషాలకే స్కూల్ పరిసరాలను వరద నీరు ముంచెత్తింది.

30 ఆగస్టు, 2026 6:33 PM•ByNarender Kumar Nangunoori

Share this article

వరద ముంచెత్తేలోపే మాస్టర్ ప్లాన్.. 1643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్‌మాస్టర్

The pressjournal Image

నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టించిన వేళ ఓ హెడ్‌మాస్టర్ చూపిన సమయస్ఫూర్తి 1643 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడింది. నువాకోట్ జిల్లా బిదుర్ మున్సిపాలిటీ పరిధిలోని త్రిశూలి లోయలో ఉన్న త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో 47 ఏళ్ల రాజేంద్ర దావాడి హెడ్‌మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. బుధవారం ఉదయం సుమారు 9:20 గంటలకు ఓ స్నేహితుడు రాజేంద్రకు ఫోన్ చేసి కీలక హెచ్చరిక చేశాడు. నది ఉద్ధృతంగా ప్రవహిస్తోందని, గ్రామాన్ని వరద నీరు ముంచెత్తే ప్రమాదం ఉందని వెంటనే పిల్లలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు. ఇదే సమయంలో ఓ విద్యార్థి తండ్రి కూడా పాఠశాలకు పరుగెత్తుకుంటూ వచ్చి వరద నీరు వేగంగా పెరుగుతోందని రాజేంద్రకు తెలిపాడు. పరిస్థితి తీవ్రతను వెంటనే అర్థం చేసుకున్న ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉపాధ్యాయులను అప్రమత్తం చేశారు.

విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటకు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టారు. స్కూల్ బస్సు డ్రైవర్లకు ఫోన్ చేసి బస్సులను ఎక్కడికక్కడే నిలిపివేయాలని ఆదేశించారు. అనంతరం 1643 మంది విద్యార్థులను కొండపై ఉన్న రావి చెట్టు వద్దకు సురక్షితంగా తరలించారు. విద్యార్థులందరూ సురక్షిత ప్రాంతానికి చేరుకున్న కొద్ది నిమిషాలకే పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. భీకర వరద నీరు స్కూల్ ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా ముంచెత్తింది. అయితే అప్పటికే పిల్లలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. రాజేంద్ర దావాడి తీసుకున్న తక్షణ నిర్ణయం, అప్రమత్తత, సమయస్ఫూర్తి కారణంగానే ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. విపత్తు సమయంలో నాయకత్వం ఎలా ఉండాలో ఆయన చర్యలు చాటిచెప్పాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు