నేపాల్: నేపాల్‌లో ప్రకృతి విలయం కొనసాగుతోంది. నేపాల్-టిబెట్ సరిహద్దులోని ఎగువ ప్రాంతంలో హిమానీనదం కూలిపోవడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీగా పోటెత్తిన వరద నీరు నదులను ముంచెత్తడంతో పరివాహక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, భవనాలు, రోడ్లు, వంతెనలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన హృదయవిదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ భీకర వరదల మధ్య ఓ భవనం మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. చుట్టూ ఉన్న నిర్మాణాలు వరద ఉధృతికి కొట్టుకుపోయినా.. ఈ ఇల్లు మాత్రం స్థిరంగా నిలిచింది. అంతేకాదు, వరద సమయంలో భవనం పై అంతస్తుకు చేరుకున్న అందులోని వ్యక్తులు కూడా సురక్షితంగా బయటపడ్డారు.
సముద్రపు అలలను తలపించిన వరద ప్రవాహం
వైరల్ అవుతున్న వీడియోలో భవనం చుట్టూ వరద నీరు భారీగా ప్రవహిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. క్షణక్షణానికీ నీటి ఉధృతి పెరగడంతో భవనంలోని వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ఉన్న ఇతర నిర్మాణాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోవడంతో.. తమ భవనం కూడా కూలిపోతుందేమోనని ఆందోళన చెందారు. ఈ దృశ్యాలను సమీపంలోని వ్యక్తులు చిత్రీకరించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, భవనంలో ఉన్నవారు క్షేమంగా ఉండాలని పలువురు ప్రార్థించారు. అయితే వరద తగ్గిన తర్వాత తీసిన మరో వీడియోలో అదే భవనం ఎలాంటి నష్టం లేకుండా నిలిచి ఉన్నట్లు కనిపించింది. దీంతో అంతటి ఉధృతమైన వరదను ఆ భవనం ఎలా తట్టుకుందంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం వారికి ఇంకా భూమ్మీద నూకలు ఉన్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
626కు చేరిన మృతుల సంఖ్య
మరోవైపు నేపాల్‌లో వరదలు, కొండచరియల విరిగిపడటంతో మృతుల సంఖ్య 626కు చేరినట్లు సమాచారం. సుమారు 2 వేల మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు దాదాపు 2,500 మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది. సహాయక, గాలింపు చర్యలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లోని నదుల్లో నీటిమట్టాలు మళ్లీ పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మరోసారి వరద ముప్పు పొంచి ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు.




















