ఖాఠ్మాండూ, ఆగస్టు 29 (జనవాణి): నేపాల్‌లో వరదల ప్రభావం పూర్తిగా తగ్గకముందే మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. భోటే కోషి–త్రిశూలి నదీ వ్యవస్థ సమీపంలో రెండు కొత్త హిమానీనద సరస్సులు (Glacial Lakes) ఏర్పడినట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధిపతి కృష్ణ వాట్సా వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. ఒక సరస్సు సుమారు 19.80 హెక్టార్లు, మరో సరస్సు 7.28 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. అయితే ఈ సరస్సుల్లో ప్రస్తుతం ఎంత నీరు ఉందో, వాటి నుంచి ఎంతమేర వరదనీరు దిగువకు వచ్చే అవకాశం ఉందో ఇప్పటివరకు అంచనా వేయలేదని తెలిపారు.
శిథిలాల పేరుకుపోవడంతో ఆందోళన
హిమానీనదాలు కదిలే సమయంలో రాళ్లు, మట్టి, ఇతర శిథిలాలు పెద్ద మొత్తంలో పేరుకుపోతుంటాయని కృష్ణ వాట్సా పేర్కొన్నారు. ఇలాంటి సహజ సరస్సుల పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని తెలిపారు. అందువల్ల వాటిపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. నేపాల్‌లోని ఈ ప్రాంతాలను భారత్ నేరుగా పర్యవేక్షించే అవకాశం పరిమితంగా ఉండటంతో ఉపగ్రహ చిత్రాలు, ఇతర సాంకేతిక మార్గాల ద్వారా పరిస్థితిని గమనించడం కీలకంగా మారింది.
ఉపగ్రహ చిత్రాల్లో మరో కొత్త సరస్సు
ఇదే సమయంలో నోయిడాకు చెందిన సుహోరా టెక్నాలజీస్ కూడా ఈ ప్రాంతంలో మరో కొత్త నీటి మడుగును గుర్తించింది. ఆగస్టు 27న తీసిన అధిక స్పష్టత కలిగిన ఉపగ్రహ చిత్రాల్లో నేపాల్–టిబెట్ సరిహద్దుకు సమీపంలోని ఎత్తైన లెండే ఖోలా ప్రాంతంలో సుమారు 20.25 హెక్టార్ల విస్తీర్ణంలో కొత్త సరస్సు కనిపించినట్లు సంస్థ తెలిపింది. ఆగస్టు 26న సంభవించిన వరదల నేపథ్యంలో ఈ సరస్సు పరిణామాన్ని నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని సుహోరా పేర్కొంది. సరస్సు విస్తీర్ణం, స్థిరత్వాన్ని ఉపగ్రహ చిత్రాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపింది. అయితే ఈ సరస్సు ఎలా ఏర్పడింది? దాని లోతు ఎంత? ఎంతవరకు స్థిరంగా ఉంది? ఒకవేళ సరస్సు తెగిపోతే దిగువ ప్రాంతాలకు ఎంతమేర ముప్పు ఏర్పడుతుంది? వంటి అంశాలపై స్పష్టత రావాలంటే మరిన్ని ఉపగ్రహ పరిశీలనలు, క్షేత్రస్థాయి అధ్యయనాలు అవసరమని సుహోరా టెక్నాలజీస్ వెల్లడించింది.




















