లోన్‌.. వర్క్‌ ఫ్రం హోం.. ఓటీపీ పేరుతో కొత్త ఎత్తులు..ఏపీకే ఫైల్‌ తెరిచారా.. ఖాతా ఖాళీ!

ఆదిలాబాద్‌ జిల్లాలో సైబర్‌ మోసాలపై ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ హెచ్చరించారు. ఏపీకే ఫైళ్లు, తెలియని లింకులు, లోన్‌, వర్క్‌ ఫ్రం హోం, ఓటీపీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వారంలో 38 సైబర్‌ క్రైమ్‌ ఫిర్యాదులు నమోదయ్యాయి.

8 ఆగస్టు, 2026 7:24 PM•ByLaharika

Share this article

లోన్‌.. వర్క్‌ ఫ్రం హోం.. ఓటీపీ పేరుతో కొత్త ఎత్తులు..ఏపీకే ఫైల్‌ తెరిచారా.. ఖాతా ఖాళీ!

ఆదిలాబాద్‌, ఆగస్టు 8 (జనవాణి): చేతిలో సెల్‌ఫోన్‌.. ఒక్క క్లిక్‌.. అంతే! క్షణాల్లో బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. వాట్సప్‌, టెలిగ్రామ్‌లో వచ్చే తెలియని లింకులు, ఏపీకే ఫైళ్లు, సోషల్‌ మీడియా ప్రకటనలు, ఆన్‌లైన్‌ ఉద్యోగాల పేరుతో సైబర్‌ నేరగాళ్లు వల విసురుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోయే ప్రమాదం ఉందని ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ హెచ్చరించారు.

సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ‘ఖాకీ కిడ్స్‌’ పేరుతో పోలీసు సిబ్బంది గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలను సందర్శించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.

ఏపీకే ఫైళ్లతో ముప్పు

వాట్సప్‌, టెలిగ్రామ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు పంపే ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్‌ చేయడం ప్రమాదకరమని ఎస్పీ తెలిపారు. వాటిని మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తే ఫోన్‌పై సైబర్‌ నేరగాళ్లకు నియంత్రణ లభించే అవకాశం ఉందన్నారు. ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్‌ వివరాలను దుర్వినియోగం చేసి ఖాతాల్లోని నగదును కాజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తెలియని లింకులపై క్లిక్‌ చేయొద్దని, ఏదైనా యాప్‌ లేదా ఫైల్‌ డౌన్‌లోడ్‌ చేసేముందు దాని విశ్వసనీయతను పరిశీలించాలని సూచించారు.

‘వర్క్‌ ఫ్రం హోం’ అంటూ..

ఇంట్లో నుంచే పనిచేస్తూ భారీగా సంపాదించవచ్చంటూ వచ్చే ప్రకటనలతో నిరుద్యోగ యువతను సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఎస్పీ తెలిపారు. పెన్సిల్‌ ప్యాకింగ్‌, డేటా ఎంట్రీ తదితర ఉద్యోగాల పేరుతో మొదట తక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాలని చెప్పి.. ఆ తర్వాత వివిధ కారణాలతో పలుమార్లు నగదు వసూలు చేస్తున్నారని వివరించారు. సోషల్‌ మీడియా ప్రకటనలను గుడ్డిగా నమ్మవద్దని సూచించారు. ప్రతి ప్రకటన నిజమైనదే అనుకోవద్దని హెచ్చరించారు.

లోన్‌ పేరుతో మరో వల

లోన్‌ మంజూరైందంటూ నమ్మించి ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర ఛార్జీల పేరుతో నగదు వసూలు చేయడం మరో రకమైన మోసమని ఎస్పీ తెలిపారు. తీసుకోని లోన్‌ బకాయి ఉందంటూ ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసే ఘటనలు కూడా నమోదవుతున్నాయని చెప్పారు.

ఓటీపీ చెప్పారంటే..

బ్యాంకు లేదా క్రెడిట్‌ కార్డు ఉద్యోగులమంటూ ఫోన్‌ చేసి ఓటీపీ, కార్డు వివరాలు అడిగే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. బ్యాంకు సిబ్బంది పేరుతో మాట్లాడినా ఓటీపీ, పిన్‌, పాస్‌వర్డ్‌, కార్డు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దన్నారు.

‘మీరు డబ్బులు పంపండి.. ఎక్కువ ఇస్తాం’

వాట్సప్‌ ద్వారా డబ్బులు పంపితే అధిక మొత్తంలో తిరిగి ఇస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయని తెలిపారు. ఇలాంటి ఆకర్షణీయమైన ఆఫర్లకు స్పందించవద్దని సూచించారు.

ఈ వారంలో 38 ఫిర్యాదులు

ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ వారంలోనే సైబర్‌ క్రైమ్‌ విభాగానికి 38 ఫిర్యాదులు అందాయని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. ఇందులో ఇన్‌స్టాగ్రామ్‌ వేధింపులు, నకిలీ ఖాతాలు, వర్క్‌ ఫ్రం హోం ఉద్యోగ మోసాలు, లోన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు పేరుతో మోసాలు, క్రెడిట్‌ కార్డు ఓటీపీ మోసం, వాట్సప్‌ నగదు మోసాలు తదితర ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు.

జిల్లాలో నమోదైన కొన్ని ఘటనలు..

• ఉట్నూర్‌ పరిధిలో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా నకిలీ, అసభ్యకర సందేశాలతో వేధింపులకు పాల్పడిన ఘటన నమోదైంది.

• పెన్సిల్‌ ప్యాకింగ్‌ ఉద్యోగం పేరుతో మోసం చేసి రూ.4,150 నష్టం కలిగించిన ఘటన ఉట్నూర్‌ పరిధిలో వెలుగుచూసింది.

• బేలా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బాధితురాలి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా సృష్టించి, ఆమె పరిచయస్తులతో చాట్‌ చేసిన ఘటన నమోదైంది.

• ఆదిలాబాద్‌ వన్‌టౌన్‌ పరిధిలో లోన్‌ మంజూరైందని నమ్మించి పలు దఫాలుగా రూ.35,315 వసూలు చేశారు.

• బోథ్‌ పరిధిలో ఎలాంటి లింక్‌, కాల్‌ లేదా సందేశం లేకుండానే ఖాతా నుంచి రూ.20 వేల నగదు బదిలీ అయిన ఘటన నమోదైంది.

• ఆదిలాబాద్‌ వన్‌టౌన్‌ పరిధిలో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు ఉద్యోగినంటూ ఓటీపీ తీసుకుని రూ.74,446 కాజేశారు.

• ఆదిలాబాద్‌ టూటౌన్‌ పరిధిలో నగదు చెల్లిస్తే అధిక మొత్తంలో తిరిగి ఇస్తామని నమ్మించి రూ.1,999 మోసం చేశారు.

• మావల పరిధిలో తీసుకోని లోన్‌ బకాయి ఉందంటూ కాల్స్‌ చేసి రూ.3,499 డిమాండ్‌ చేసిన ఘటన నమోదైంది.

• ఆదిలాబాద్‌ టూటౌన్‌ పరిధిలో ఆన్‌లైన్‌ డేటా ఎంట్రీ ఉద్యోగం పేరుతో పని చేయించి, అనంతరం పెనాల్టీ పేరుతో రూ.5 వేలు డిమాండ్‌ చేస్తూ బెదిరించిన ఘటన వెలుగుచూసింది.

డబ్బు పోతే.. వెంటనే 1930

సైబర్‌ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయాలని ఎస్పీ సూచించారు. జాతీయ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు. ముఖ్యంగా ఆర్థిక మోసాల్లో వీలైనంత త్వరగా ఫిర్యాదు చేస్తే నగదు లావాదేవీలను నిలిపివేసి డబ్బు తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఎవరికైనా సైబర్‌ నేరం జరిగితే సమీప పోలీస్‌స్టేషన్‌లోని సైబర్‌ వారియర్‌ సిబ్బందిని వెంటనే సంప్రదించాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ సూచించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు