ఆదిలాబాద్,సెప్టెంబర్ 22 (జనవాణి): ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రిలోని నవజాత శిశువుల ఎస్‌ఎన్‌సీయూ వార్డులో ఏసీ వద్ద షార్ట్‌సర్క్యూట్ జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ పేలడంతో వార్డంతా దట్టమైన పొగ కమ్ముకుంది.
ప్రమాద సమయంలో ఎస్‌ఎన్‌సీయూ వార్డులో 27 మంది చిన్నారులు ఉన్నారు. మంటలు, పొగతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి చిన్నారులను పక్క వార్డుకు తరలించారు.
ముగ్గురు పసికందుల మృతి
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రిమ్స్‌కు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం చిన్నారులను మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. అయితే దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక ఐదు రోజుల పసికందు అక్కడికక్కడే మృతిచెందింది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మరికొందరు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఘటనాస్థలిని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ప్రమాదం గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ రిమ్స్‌ను సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమికంగా షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం
ఆదిలాబాద్ రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్నారుల మృతి అత్యంత బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని స్పష్టం చేశారు.




















