హైదరాబాద్, ఆగస్టు 31 (జనవాణి): బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు నిర్వహించిన ఆందోళనపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలు బీజేపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పాటు బీజేపీ కార్యాలయ గేటుకు నల్ల రంగు పూయడంపై బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తోందా? అని నిలదీశారు. బీజేపీ కార్యాలయానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అని ప్రశ్నించారు.
పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు
యూత్ కాంగ్రెస్ నేతలు అరాచకం సృష్టిస్తుంటే అక్కడ పోలీసులు ఎందుకు లేరని బండి సంజయ్ ప్రశ్నించారు. పోలీసులు కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని విమర్శించారు. పోలీసుల వైఫల్యానికి మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఆయన.. ఘటనకు కారణమైన వారిని అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. సకాలంలో చర్యలు తీసుకోకపోతే యూత్ కాంగ్రెస్ చర్యలకు దీటుగా బీజేపీ శ్రేణుల నుంచి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ కార్యాలయాల దిగ్బంధానికి హెచ్చరిక
ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకత్వం తక్షణమే స్పందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ కార్యాలయాలను బీజేపీ శ్రేణులు దిగ్బంధిస్తాయని హెచ్చరించారు. దీనివల్ల తలెత్తే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్
బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన ఘటనపై బండి సంజయ్ తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. దిష్టిబొమ్మ దగ్ధం, కార్యాలయ గేటుకు నల్ల రంగు పూయడం వంటి ఘటనలు జరుగుతున్న సమయంలో పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోయారని ఆరా తీశారు. ఘటనపై వివరణ కోరిన ఆయన.. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాలని డిమాండ్ చేశారు.




















