జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ను తొలగిస్తే ఉద్యమం తప్పదు.. బీసీ సంక్షేమ సంఘం హెచ్చరిక

జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌గా నియమితులైన ప్రొఫెసర్ జయలక్ష్మిని పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీసీ సంక్షేమ సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆమెను తొలగించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి, అవసరమైతే జేఎన్‌టీయూను ముట్టడిస్తామని సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

31 జులై, 2026 9:03 PM•ByLaharika

Share this article

జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ను తొలగిస్తే ఉద్యమం తప్పదు.. బీసీ సంక్షేమ సంఘం హెచ్చరిక


జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జయలక్ష్మిపై ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలోని ప్రధాన విశ్వవిద్యాలయాల్లో ఉన్నత పదవుల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని, జేఎన్‌టీయూ చరిత్రలో తొలిసారిగా బీసీ మహిళకు రిజిస్ట్రార్‌గా అవకాశం లభించగా, కేవలం 45 రోజుల్లోనే ఆమెను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.

బీసీలకు వాటా కల్పించాలని డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన నిర్వహించామని ప్రచారం చేసుకోవడం మాత్రమే సరిపోదని, ఆ లెక్కల ప్రకారం అధికార పదవులు, ప్రభుత్వ ఉద్యోగాలు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, బోర్డుల్లో కూడా బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం బీసీలు 56 శాతం ఉన్నప్పటికీ, అదే స్థాయిలో నిర్ణయాత్మక పదవుల్లో అవకాశాలు ఎందుకు లేవని ప్రశ్నించారు.

జయలక్ష్మి అర్హతలను ప్రస్తావించిన జాజుల

ప్రొఫెసర్ జయలక్ష్మి సగర ఉప్పర సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్త అని, ఐఐటీలో ఉన్నత విద్య పూర్తి చేసి, దాదాపు 27 ఏళ్లుగా జేఎన్‌టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, ప్రిన్సిపాల్, డైరెక్టర్‌గా వివిధ బాధ్యతలు నిర్వహించారని పేర్కొన్నారు. ఆమె అర్హత, అనుభవం, సీనియారిటీ ఆధారంగానే రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారని తెలిపారు.

సీఎం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి

సామాజిక న్యాయం గురించి ప్రభుత్వం మాట్లాడుతున్నప్పటికీ, నిర్ణయాల్లో అది కనిపించడం లేదని జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ అంశంపై జోక్యం చేసుకుని జయలక్ష్మికి న్యాయం చేయాలని కోరారు. అలాగే మహిళా సాధికారతపై మాట్లాడే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా ఈ అంశంపై స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

24 గంటల గడువు.. తర్వాత ఉద్యమం

ప్రభుత్వం 24 గంటల్లో ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి జయలక్ష్మికి న్యాయం చేయాలని, లేకపోతే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థి, యువజన సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అనంతరం కూడా ప్రభుత్వం స్పందించకపోతే వేలాది మందితో జేఎన్‌టీయూను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో బీసీ జేఏసీ, బీసీ కుల సంఘాల జేఏసీ, బీసీ యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు