హైదరాబాద్, ఆగస్టు 2: పార్టీ మార్పు ఊహాగానాల మధ్య మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నానని చెప్పారు. దీంతో తాను బీఆర్ఎస్‌తోనే ఉన్నాననే సంకేతాలను మరోసారి బలంగా వినిపించారు.
లష్కర్ బోనాల సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి చామకూర మల్లారెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతి ఏడాది ఉజ్జయిని మహంకాళి అమ్మవారి వద్దకు వస్తుంటానని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో గతంలో తాను కోరుకున్నవన్నీ నెరవేరాయని తెలిపారు. అందుకే మరోసారి ప్రత్యేకంగా ఒక కోరిక కోరుకున్నానని పేర్కొన్నారు. మా కేసీఆర్ మళ్లీ తెలంగాణ సీఎం కావాలని కోరుకుంటున్నా అని చెప్పారు.
మల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇటీవల ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారానికి తెరదించినట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్‌పై తనకు పూర్తి విశ్వాసం ఉందని, బీఆర్ఎస్‌కు కట్టుబడి ఉన్నాననే సంకేతాన్ని ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా ఇచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Loading Tweet...
రేవంత్ సభ తర్వాత మొదలైన ప్రచారం
ఇటీవల ఘట్‌కేసర్‌లో జరిగిన అందెశ్రీ స్మృతివనం భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే అదే వేదికపై ఉన్న మల్లారెడ్డి ఆ వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో బీఆర్ఎస్ నిర్వహించిన యువ సంగ్రామ సదస్సుకు మల్లారెడ్డి గైర్హాజరు కావడం పలు అనుమానాలను రేకెత్తించింది. మల్లారెడ్డి పార్టీ మారతాడని.. బీజేపీలో చేరతాడని ప్రచారం ఊపందుకుంది.
అయితే ఈ ప్రచారం ఊపందుకున్న సమయంలోనే మల్లారెడ్డి స్పందిస్తూ.. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని, ఇతర ఏ రాజకీయ పార్టీలో చేరే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. సోషల్‌మీడియా, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. గతంలో పార్టీ కోసం ఎలా పనిచేశానో.. ఇక ముందు కూడా అదే నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పుడు మరోసారి బోనాల పండుగ సందర్భంగా మరోసారి తన రాజకీయ వైఖరిని స్పష్టం చేశారు.





















