చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: కేసీఆర్

చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆమెకు నివాళులు అర్పించారు. తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరంగా, రాష్ట్ర తెగువకు ప్రతీకగా ఐలమ్మ నిలిచారని కొనియాడారు. రైతాంగం, సబ్బండ కులాల అభ్యున్నతికి కృషి చేయడమే ఆమెకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

26 సెప్టెంబర్, 2026 11:05 AM•ByNarender Kumar Nangunoori

Share this article

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: కేసీఆర్

హైదరాబాద్,సెప్టెంబర్ 26 (జనవాణి): చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆమెకు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం, రాష్ట్ర తెగువకు నిలువెత్తు నిదర్శనం చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ రైతాంగం, సబ్బండ కులాల అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగించడం ద్వారా ఆమెకు నిజమైన నివాళి అర్పించినవారమవుతామని అన్నారు. నాటి రాచరిక, భూస్వామ్య పాలనలో రైతాంగం న్యాయమైన హక్కుల కోసం ఐలమ్మ ధైర్యంగా పోరాడారని కేసీఆర్ పేర్కొన్నారు. అణచివేతకు గురైన సబ్బండ కులాల ఆత్మగౌరవానికి ఆమె ప్రతీకగా నిలిచారని తెలిపారు.

ఐలమ్మ పోరాటం నేటి తరానికి ఆదర్శం

భూస్వామ్య వ్యవస్థను ఎదిరించి ధిక్కార స్ఫూర్తిని ప్రదర్శించడంతో పాటు, నాటి చట్టాల పరిధిలో న్యాయస్థానంలోనూ పోరాడి విజయం సాధించడం ద్వారా ఐలమ్మ ప్రజాస్వామిక స్ఫూర్తిని చాటారని కేసీఆర్ అన్నారు. ఆమె పోరాటం నేటి తరానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాల్సిన అవసరం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐలమ్మ ప్రదర్శించిన ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తి, తెలంగాణ తెగువ యువతకు అనుసరణీయమని అన్నారు. తాను ప్రారంభించిన మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఇమిడి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.

ఐలమ్మ జయంతి నిర్వహణకు శ్రీకారం

చాకలి ఐలమ్మ గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించే సంప్రదాయాన్ని తీసుకొచ్చామని కేసీఆర్ గుర్తు చేశారు.

మహిళలు, రైతులు, సబ్బండ కులాల కోసం పథకాలు

ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా తమ పదేళ్ల పాలనలో మహిళలు, శిశు సంక్షేమం, రైతాంగం, సబ్బండ కులాల అభ్యున్నతి కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు కుల వృత్తులకు పునరుజ్జీవం కల్పించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

సబ్బండ కులాల ఆర్థిక, సామాజిక ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా తమ ప్రభుత్వం పనిచేసిందని కేసీఆర్ అన్నారు. తమ హయాంలో సాధించిన ఫలితాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమాన్ని పాలనా ప్రాధాన్యంగా అమలు చేయడమే ఆమెకు నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.

▶CategoriesNews and Telangana
▶Follow us onFacebook, Twitter & Instagram.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు