ముంబై,సెప్టెంబర్ 30 (జనవాణి): ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై తీవ్ర ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. బొరివలి వెస్ట్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఎల్.టి. రోడ్డులో ఉన్న రాధాకృష్ణ హోటల్‌లో మైసూర్ మసాలా దోశలో చచ్చిన ఎలుక పిల్ల కనిపించింది. ఈ ఘటనతో కస్టమర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.
ఓ కస్టమర్ తన సోదరుడితో కలిసి హోటల్‌కు వెళ్లి మైసూర్ మసాలా దోశను ఆర్డర్ చేశాడు. దోశను సర్వ్ చేసిన తర్వాత రెండు, మూడు ముద్దలు తిన్నాడు. ఈ క్రమంలో దోశ లోపల నల్లగా ఏదో కనిపించడంతో అనుమానం వచ్చి పరిశీలించాడు. తీరా అది చచ్చిన ఎలుక పిల్ల అని గుర్తించాడు. వేడి వేడి ఆహారంలో ఎలుకను చూసిన కస్టమర్ తీవ్ర అసహనానికి గురై అక్కడికక్కడే వాంతులు చేసుకున్నట్లు సమాచారం.
పోలీసులకు ఫిర్యాదు
ఈ ఘటనపై బాధిత కస్టమర్ వెంటనే బొరివలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రెస్టారెంట్‌లో ఆహారాన్ని తయారు చేసే ప్రాంతాల్లో పరిశుభ్రతా ప్రమాణాలు, భద్రతా చర్యలు సరిగా పాటిస్తున్నారా అనే అంశంపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. మరోవైపు, నిత్యం పెద్ద సంఖ్యలో కుటుంబాలు, కస్టమర్లు వచ్చే రెస్టారెంట్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు హోటల్‌పై తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ తనిఖీలు
మహారాష్ట్రలో ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న రెస్టారెంట్లపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల పలు రెస్టారెంట్లలో పరిశుభ్రతా లోపాలు బయటపడటంతో వాటిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
క్యాని & కో (Kyani & Co)లో ఆహార తయారీ, నిల్వ ప్రాంతాల్లో పిల్లులు, ఈగలు, ఎలుకల మల విసర్జనలు, చచ్చిన బొద్దింకలు కనిపించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే బీజేఆర్‌ఎస్ గ్యాలప్స్ (BJRS Gallops)లో ఐస్‌పై రక్తపు మరకలు, మురికి, బొద్దింకలు, చీమలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఇక ఒలింపియా కాఫీ హౌస్, కేఫ్ మోండెగర్ వంటి సంస్థలపై కూడా శానిటేషన్, ఆహార నిల్వకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాధాకృష్ణ హోటల్‌లో ఏకంగా వడ్డించిన దోశలోనే చచ్చిన ఎలుక బయటపడటం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.




















