హైదరాబాద్, ఆగస్టు 4 (జనవాణి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ నియామకాల నోటిఫికేషన్‌లో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 13 వేల ఉద్యోగాలనే భర్తీ చేసిందన్నారు. డీజీపీ గతంలో చెప్పినదాని ప్రకారం రాష్ట్రంలో 19 వేల పోలీస్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం కేవలం 7 వేలకుపైగా పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేసిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జీవో–31 ద్వారా కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల వయోపరిమితిని పెంచినా, తాజా నోటిఫికేషన్‌లో మాత్రం పాత వయోపరిమితినే అమలు చేసిందని అన్నారు. పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలని డిమాండ్ చేశారు. ఫైర్ డిపార్ట్‌మెంట్ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్ నిబంధన విధించడం వల్ల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కొత్త పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటైన నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వుల కారణంగా కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడం ఆలస్యమవుతుందని ప్రభుత్వం చెబుతోందని, అలాంటి పరిస్థితిలో పాత జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయాలని సూచించారు.
శారీరక పరీక్షల్లో లాంగ్‌జంప్‌కు సంబంధించిన కొత్త నిబంధనలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కోరారు. గతంలో కాంగ్రెస్ నేతలే ఈ అంశంపై గాంధీభవన్ ఎదుట ధర్నాలు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల నుంచి అధిక పరీక్ష ఫీజులు వసూలు చేయడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ఎస్సై పోస్టులకు రూ.1,500, కానిస్టేబుల్ పోస్టులకు రూ.1,000 పరీక్ష ఫీజు నిర్ణయించడం ద్వారా ప్రభుత్వం నిరుద్యోగులతో వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలాంటి ఫీజులు వసూలు చేయబోమని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.





















