హైదరాబాద్, జూలై 30 : తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో తెలంగాణ జలాశయాలకు నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. కృష్ణా, గోదావరి బేసిన్‌లలోని ప్రధాన ప్రాజెక్టులకు భారీగా ఇన్‌ఫ్లో నమోదవుతుండటంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జూరాల, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండగా.. మేడిగడ్డ బ్యారేజీకి భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి కూడా జూరాల నుంచి వరద ఉధృతంగా చేరుతోంది.
జూరాలలో పెరిగిన వరద.. 10 గేట్లు ఎత్తివేత
కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా నీటి విడుదల చేయడంతో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. గురువారం ఉదయం 9 గంటలకు జూరాలకు 90,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో అధికారులు 10 స్పిల్‌వే గేట్లను ఒక మీటర్ ఎత్తి 39,080 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జలవిద్యుత్ కేంద్రం ద్వారా 38,272 క్యూసెక్కులు విడుదలవుతుండగా.. మొత్తం 81,730 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం 317.40 మీటర్లకు చేరుకుంది.

శ్రీశైలానికి 79,403 క్యూసెక్కుల వరద
జూరాల నుంచి విడుదలవుతున్న నీటితో శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు శ్రీశైలం జలాశయానికి 79,403 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. జలాశయం నీటిమట్టం 824.80 అడుగులు ఉండగా.. నీటి నిల్వ 44.609 టీఎంసీలుగా నమోదైంది. ప్రస్తుతం శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించలేదు. స్పిల్‌వే గేట్లు కూడా ఇంకా తెరవలేదు.
ఆలమట్టి, నారాయణపూర్ నుంచి భారీ విడుదల
కృష్ణా ఎగువన ఉన్న ఆలమట్టి జలాశయం నుంచి ప్రస్తుతం 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి కూడా 1.11 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. ఈ ప్రవాహం ప్రభావంతో జూరాల, అనంతరం శ్రీశైలం జలాశయాలకు వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మేడిగడ్డకు 81 వేల క్యూసెక్కుల వరద
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీకి గురువారం 81,060 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. బ్యారేజీలోని 85 గేట్లను ఎత్తి వచ్చిన నీటినంతా దిగువకు విడుదల చేస్తున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గోదావరి తీరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కడెం గేట్లు తెరిచిన అధికారులు
ఆదిలాబాద్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు 42,761 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. తొలుత గేట్లు మూసి ఉంచిన అధికారులు.. నీటిమట్టం పెరగడంతో ఉదయం 10.30 గంటలకు ఆరు గేట్లను తెరిచారు. ప్రస్తుతం 45,768 క్యూసెక్కుల మిగులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎల్లంపల్లి వద్ద హెచ్చరిక
కడెం నుంచి నీటి విడుదలతో పాటు ఎగువ క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ హెచ్చరించింది. గోదావరి నది దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు, పశువుల కాపరులు నది ఒడ్డుకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఇతర జలాశయాల పరిస్థితి
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు జలాశయానికి 517 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 470 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 4.249 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీరాంసాగర్ (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) ప్రాజెక్టుకు 9,240 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, 751 క్యూసెక్కుల నీటిని కాలువలు, మిషన్ భగీరథ అవసరాలకు విడుదల చేస్తున్నారు. స్వర్ణ, గడ్డెన్నవాగు వంటి మధ్య తరహా ప్రాజెక్టుల్లో కూడా ఇన్‌ఫ్లో పెరుగుతున్నప్పటికీ, ఇంకా గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి రాలేదు.




















