హైదరాబాద్, ఆగస్టు 03: గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజారవాణాను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం, మరోవైపు నగర శివారు ప్రాంతాలు వేగంగా విస్తరిస్తుండటంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త డిపోల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 26 బస్ డిపోలు కొనసాగుతుండగా.. ఈ ఏడాది డిసెంబరు నాటికి వీటి సంఖ్యను 31కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ప్రణాళికలో భాగంగా ముషీరాబాద్‌లో హైదరాబాద్-3 డిపో, నాగారం రోడ్డులో జవహర్‌నగర్ డిపో ఏర్పాటు చేయనున్నారు. అలాగే గతంలో మూతపడిన రాణిగంజ్-2 డిపోను ఆధునిక సదుపాయాలతో పునఃప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలో కొత్త డిపోల ఏర్పాటుకు శివారు ప్రాంతాల్లో కొత్త డిపోల ఏర్పాటుకు తగిన స్థలాలు కేటాయించాలని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లను ఆర్టీసీ అధికారులు కోరారు. శివారు ప్రాంతాల్లో డిపోలు అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రవాణా సేవలు అందనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతిరోజూ సుమారు 2,800 బస్సులు నడుస్తుండగా, వాటిలో 493 ఎలక్ట్రిక్ బస్సులు సేవలు అందిస్తున్నాయి.
ప్రస్తుతం హయత్ నగర్-2 డిపో నుంచి 98, హెచ్‌సీయూ డిపో నుంచి 101, కూకట్‌పల్లి డిపో నుంచి 20, మియాపూర్-2 డిపో నుంచి 100, కంటోన్మెంట్ డిపో నుంచి 80, రాణిగంజ్ డిపో నుంచి 75 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. అంతేకాక నగరంలోని అన్ని డిపోల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో జిల్లాల నుంచి వచ్చే ఎలక్ట్రిక్ బస్సులు కూడా రాత్రి సమయంలో సమీప డిపోల్లో ఛార్జింగ్ చేసుకుని తిరిగి తమ సర్వీసులను కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ చర్యలతో పర్యావరణహిత రవాణాకు మరింత ఊతం లభించడంతో పాటు నగరంలో బస్సు సర్వీసుల సామర్థ్యం కూడా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.





















