హైదరాబాద్, ఆగస్టు 17 (జనవాణి): జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యం చేయడం సరికాదని ఫెడరేషన్ నాయకులు స్పష్టం చేశారు. సోమవారం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ తదితరులు సచివాలయంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మంత్రితో సుదీర్ఘంగా చర్చించి, వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా ప్రభుత్వం చట్టపరమైన మార్గాలను పరిశీలించాలని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కోరారు. అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విధి నిర్వహణలో లేదా ఇతర కారణాలతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను కూడా ఇళ్ల స్థలాల పథకంలో పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను గుర్తించి వారికి ప్రత్యేకంగా సంక్షేమ చర్యలు చేపట్టాలని ఫెడరేషన్ నేతలు విజ్ఞప్తి చేశారు.
కేబుల్, ఐపీ న్యూస్ ఛానళ్లకు అక్రెడిటేషన్
రాష్ట్రంలోని అన్ని కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్లకు వెంటనే అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ కోరింది. అదేవిధంగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ) ఆధారిత న్యూస్ ఛానళ్లకు కూడా అక్రెడిటేషన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేసింది. కేబుల్ ఛానళ్లకు జిల్లాస్థాయిలో నాలుగు, రాష్ట్రస్థాయిలో 12 అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు
అక్రెడిటేషన్ కార్డులు ఉన్నప్పటికీ హెల్త్ కార్డుల విషయంలో జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫెడరేషన్ నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న తరహాలో అర్హులైన జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో జర్నలిస్టులకు ఉచిత వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పెండింగ్‌లో ఉన్న ప్రకటనల బిల్లులు చెల్లించాలి
చిన్న, మధ్యతరహా పత్రికలకు గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ప్రకటనల బిల్లులను వెంటనే చెల్లించాలని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. చిన్న, మధ్యతరహా పత్రికలను ప్రభుత్వ ప్రకటనల ఎంపానెల్‌మెంట్‌లో చేర్చి, వాటి మనుగడకు ప్రభుత్వం సహకరించాలని కోరారు.
రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్
సీనియర్, రిటైర్డ్ జర్నలిస్టుల కోసం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేయాలని ఫెడరేషన్ డిమాండ్ చేసింది. జర్నలిస్టుల పిల్లలు ఎంతవరకు చదువుకున్నా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఉచిత విద్య అందించేలా ప్రత్యేక జీవో జారీ చేయాలని కోరారు. అలాగే జర్నలిస్టులందరికీ ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టు మరణించిన సందర్భంలో వారి కుటుంబానికి రూ.10 లక్షల బీమా పరిహారం అందేలా ప్రత్యేక పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ
జర్నలిస్టులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను సానుకూలంగా పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చినట్లు టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు తెలిపారు. మంత్రి పొంగులేటిని కలిసిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కుంచం శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి. రవికుమార్, కో-కన్వీనర్లు ఆర్. శ్రీనివాస్ గౌడ్, ఎస్. రవికుమార్ తదితరులు ఉన్నారు.




















