హన్మకొండ,సెప్టెంబర్ 01 (జనవాణి): అధికారం కోల్పోయామన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై పదేపదే విమర్శలు చేస్తున్నారని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్.. ప్రజల తీర్పుతో ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రెండుమూడేళ్లు కూడా ఓపికగా ఉండలేకపోతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేక ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై విమర్శలు చేయడం బీఆర్‌ఎస్ అధికార దాహాన్ని చూపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని సూచించారు.
1000 రోజుల పాలనే ప్రోగ్రెస్ రిపోర్ట్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు రెండున్నరేళ్లలో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిందని కడియం కావ్య తెలిపారు. విద్యార్థి తన చదువు ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను చూసుకున్నట్టే.. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో చేసిన పనులే తమ ప్రోగ్రెస్ రిపోర్ట్ అని అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం భారీ అప్పుల భారంలోకి వెళ్లినా.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు.
విద్య, ఉద్యోగాలపై ఫోకస్
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురైందని ఎంపీ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల నియామకాలు చేపట్టడంతో పాటు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యార్థులకు పాఠశాలలు మాత్రమే కాకుండా నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయుల నియామకాలకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. డీఎస్సీ ద్వారా సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని, వివిధ శాఖల్లో కలిపి సుమారు 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వెల్లడించారు.
మహిళా సాధికారతకు ప్రాధాన్యం
మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కడియం కావ్య తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా సుమారు రూ.60 వేల కోట్ల రుణాలు అందించామని తెలిపారు. పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్లు వంటి రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని, మహిళలను ఆర్టీసీ బస్సుల యజమానులుగా తీర్చిదిద్దే దిశగా కూడా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లపై కీలక వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో పేదలకు హామీలు ఇచ్చి అనేక ప్రాంతాల్లో ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిందని ఎంపీ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే తొలి దశలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ పక్షపాతం లేదని స్పష్టం చేశారు. అర్హత ఆధారంగా కలెక్టర్ల పర్యవేక్షణలో ఎంపిక జరుగుతోందన్నారు.
కేసీఆర్‌కు సూచన
మాజీ సీఎం కేసీఆర్‌కు రాజకీయ అనుభవం ఉందని, ఆయన అభివృద్ధికి ఉపయోగపడే నిర్మాణాత్మక సూచనలు చేస్తే ప్రభుత్వం స్వీకరించేందుకు సిద్ధంగా ఉందని కడియం కావ్య అన్నారు. ప్రతిరోజూ రాజకీయ విమర్శలు చేయడం, కాలయాపన చేయడం వల్ల తెలంగాణకు ప్రయోజనం ఉండదన్నారు. ప్రజలు ఒక పార్టీకి అధికారాన్ని, మరో పార్టీకి ప్రతిపక్ష బాధ్యతను అప్పగించారని.. ఇరు పక్షాలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రతిపక్షాలు ముందుకు రావాలని కోరారు.
వైఎస్సార్‌కు నివాళులు
అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని హన్మకొండలోని డీసీసీ కార్యాలయంలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే.. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త కార్యక్రమాలను చేపడుతోందని ఆమె తెలిపారు. చెప్పినవి చేస్తున్నాం.. చెప్పనివి కూడా చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు ఇదే మా ప్రోగ్రెస్ రిపోర్ట్ అని కడియం కావ్య స్పష్టం చేశారు.




















