తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకంతో రైతులు పారిశ్రామికవేత్తలుగా ఎదగొచ్చు: మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్

తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకాన్ని వ్యవసాయానికి అనుబంధంగా చేపడితే రైతులు, నిరుద్యోగ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశాలు మెరుగుపడతాయని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందే ఈ రంగాలను ప్రభుత్వ పథకాల సాయంతో విస్తరించాలని ఆమె సూచించారు.

27 జులై, 2026 4:14 PM•ByLaharika

Share this article

తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకంతో రైతులు పారిశ్రామికవేత్తలుగా ఎదగొచ్చు: మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో రైతు మహిపాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సోమవారం తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్, డీఆర్‌డీఓ శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ ప్రతిమా సింగ్.. ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో రైతులు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకం గ్రామీణ ప్రాంతాల్లో అదనపు ఆదాయంతో పాటు ఆర్థిక భద్రతను కల్పించే లాభదాయక వ్యవసాయ అనుబంధ రంగాలని పేర్కొన్నారు.

ప్రత్యామ్నాయ ఉపాధికి ప్రాధాన్యం

నిరుద్యోగ యువత, మహిళలు, చిన్న, సన్నకారు రైతులు ఈ రంగాల్లోకి వస్తే స్థిరమైన ఆదాయ వనరులు ఏర్పడతాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న సబ్సిడీలు, శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్

తేనె, పుట్టగొడుగుల ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని పేర్కొన్న కలెక్టర్, రైతులు యూనిట్లు ఏర్పాటు చేసి అదనపు ఆదాయాన్ని పొందే దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో కుటీర పరిశ్రమగా పుట్టగొడుగుల సాగు, తేనెటీగల పెంపకం చేపట్టి రైతులు, మహిళలు మంచి ఆదాయం పొందవచ్చన్నారు. ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖల ద్వారా అందుతున్న సబ్సిడీలు, శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ఆమె సూచించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు