కన్న కొడుకులే కాదన్నారు.. చివరకు సొంత పొలంలోని బావిలోనే దంపతుల బలవన్మరణం

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్టా(కె) గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉన్న వ్యవసాయ భూమిని కొడుకుల పిల్లలకు రాసిచ్చినా వృద్ధాప్యంలో కన్న కొడుకుల ఆదరణకు నోచుకోలేకపోయిన దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇంటి నుంచి గెంటివేయడంతో అద్దె ఇంట్లో ఉంటున్న వారు చివరకు తమ వ్యవసాయ పొలంలోని బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు.

30 సెప్టెంబర్, 2026 4:33 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కన్న కొడుకులే కాదన్నారు.. చివరకు సొంత పొలంలోని బావిలోనే దంపతుల బలవన్మరణం

నారాయణఖేడ్,సెప్టెంబర్ 30 (జనవాణి): సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్టా(కె) గ్రామానికి చెందిన నర్సారెడ్డి, అంజమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు సిద్ధారెడ్డి, కిష్టారెడ్డి, సంగారెడ్డి ఉన్నారు. రెండో కుమారుడు కిష్టారెడ్డి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే నివసిస్తుండగా మిగిలిన ఇద్దరు కుమారులు గ్రామంలోనే ఉంటున్నారు.

వృద్ధ దంపతులు తమ పేరిట ఉన్న వ్యవసాయ భూమిని మొదటి, మూడో కుమారుల పిల్లలకు రాసిచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన కుమారులు వారిని సొంత ఇంటి నుంచే బయటకు పంపించినట్లు సమాచారం.

అద్దె ఇంట్లో ఆశ్రయం.. అయినా ఆదరణ కరవే

ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో నర్సారెడ్డి, అంజమ్మ అదే గ్రామంలో ఓ చిన్న అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న రెండో కుమారుడు కిష్టారెడ్డి కొంతమేర వారి పోషణ ఖర్చులు చూస్తున్నప్పటికీ గ్రామంలోనే ఉన్న కుమారుల నుంచి కనీస ఆదరణ కూడా లభించకపోవడం వారిని తీవ్రంగా కలచివేసినట్లు తెలుస్తోంది. తమను కుమారులు పట్టించుకోవడం లేదంటూ గతంలో వృద్ధ దంపతులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు.

సొంత పొలంలోని బావిలో విషాదాంతం

కుమారుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు మంగళవారం రాత్రి తమ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి బావిలో దూకినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం బావిలో మృతదేహాలు కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. స్థానికుల సహకారంతో మృతదేహాలను బావిలో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు కుమారులు ఉన్నప్పటికీ వృద్ధాప్యంలో అండకు నోచుకోకుండా దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు