హైదరాబాద్, ఆగస్టు 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న బహుళార్థసాధక బ్యారేజీ, జలవిద్యుత్ ప్రాజెక్టు అయిన సీతమ్మసాగర్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సాగునీటి శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సీతమ్మసాగర్ ప్రాజెక్టు పురోగతిపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. సీతమ్మసాగర్ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అత్యంత కీలక సాగునీటి ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
ఇటీవలే సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు అవసరమైన పూర్తి పర్యావరణ అనుమతులు కూడా లభించాయని గుర్తు చేసిన మంత్రి, ఇక పనులను మరింత వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు శాశ్వత సాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు ప్రాంతీయ వ్యవసాయాభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని అన్నారు.
ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి తావులేకుండా పనుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.





















