తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను తప్పనిసరిగా ముద్రించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా అందిస్తున్న బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ద్వారా ఇస్తున్న ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోలు కేంద్రం అందిస్తున్నవేనని రఘునందన్ రావు పేర్కొన్నారు. అలాంటప్పుడు ఒక్క కిలో బియ్యం అందిస్తూ కార్డుపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 1.06 కోట్ల రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఇప్పటికే సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, కొత్తగా ఎన్ని కార్డులు జారీ చేస్తున్నారో వెల్లడించాలని కోరారు. అలాగే స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణకు సంబంధించిన ఖర్చులు, టెండర్ల వివరాలను బహిర్గతం చేయాలని అన్నారు. కార్డుల ముద్రణ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు? అనే వివరాలను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
రేషన్ డీలర్ల సమస్యలపైనా రఘునందన్ రావు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి గౌరవ వేతనం చెల్లించాలని, పెంచిన కమిషన్‌ను వెంటనే ఇవ్వాలని కోరారు. బియ్యంలో నూకలు ఎక్కువగా ఉన్నాయన్న ఫిర్యాదులను కూడా పరిష్కరించాలని సూచించారు. రేషన్ కార్డుల ద్వారా పేదలకు మరిన్ని నిత్యావసర సరుకులు అందించాలని ఆయన కోరారు. కర్ణాటక తరహాలో కందిపప్పు, వంటనూనె, రాగులు, చక్కెర, గోధుమలు వంటి సరుకులను కూడా పంపిణీ చేయాలని సూచించారు. బియ్యం తీసుకోవాలనుకోని వారికి ప్రత్యామ్నాయ ఆహార ధాన్యాలు అందించాలని అన్నారు. పేదల ఆహార భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని రఘునందన్ రావు పేర్కొన్నారు. రేషన్ కార్డుల పంపిణీ విధానాన్ని పునఃపరిశీలించి, ప్రధాని మోదీ ఫొటోతో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు.





















