సీఎం టూర్ వెనుక ఫ్యూచర్ సిటీ ప్రమోషనా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసమే ఈ పర్యటన చేపట్టారని, సీఎం కుటుంబ సభ్యులకు అక్కడ వేల ఎకరాల భూములు ఉన్నాయని ఆరోపించారు.

25 ఆగస్టు, 2026 3:36 PM•ByNarender Kumar Nangunoori

Share this article

సీఎం టూర్ వెనుక ఫ్యూచర్ సిటీ ప్రమోషనా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌, ఆగస్టు 25 (జనవాణి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చుట్టూ రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, ప్రమోషన్ కోసమే సీఎం విదేశీ పర్యటన చేపట్టారని, ఆయన కుటుంబ సభ్యులకు అక్కడ సుమారు 3 వేల ఎకరాల భూములు ఉన్నాయని ఆరోపించారు.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించలేదని విమర్శించారు. డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌తో ప్రయాణించే ప్రజాప్రతినిధులు విదేశాంగ శాఖకు ముందస్తుగా పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని, ఈ విషయంలో సీఎం నిబంధనలను పాటించారా అనే సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేటీఆర్, హరీశ్ రావు గతంలో విదేశీ పర్యటనలు చేసినప్పుడు అన్ని నిబంధనలు పాటించారని, అందుకే ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని అన్నారు. అయితే సీఎం పర్యటన విషయంలో ఎందుకు వివాదం తలెత్తిందో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూకే, అమెరికా విశ్వవిద్యాలయాల పేరుతో విదేశీ పర్యటనకు వెళ్తున్నానని సీఎం చెబుతున్నారని, ప్రస్తుతం అక్కడ సెలవుల కాలం కొనసాగుతున్న సమయంలో ఎవరిని కలవబోతున్నారో వెల్లడించాలని ప్రశ్నించారు. విదేశీ విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడే ముందు తెలంగాణ గర్వకారణమైన ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఆ నిధులను ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలను బలోపేతం చేయకుండా విదేశీ పర్యటనల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ ఆత్మగౌరవం అంశాన్ని రాజకీయ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. గోదావరి జలాల అంశం నుంచి వివిధ శాఖల్లో అధికారుల నియామకాల వరకు అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రయోజనాలను విస్మరించారని ఆరోపించారు. నిజంగా తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నదని భావిస్తే సీఎం తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనను అడ్డుకోవడానికి ఉన్న కారణాలను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేసిన ఆయన, సీఎం ఇకనైనా పర్యటనపై పూర్తి వాస్తవాలు చెప్పాలని కోరారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు