రంగారెడ్డి,సెప్టెంబర్ 24 (జనవాణి): రంగారెడ్డి జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మూసీ పాత వంతెన వద్ద ఈ ఘటన జరిగింది. గణేశ్ నిమజ్జనం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ.. కొందరు వంతెనపై నుంచి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తూ వినాయక విగ్రహంతో పాటు మూసీ నదిలో పడిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఘటనతో అక్కడున్న భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే నదిలో పడిన కొద్దిసేపటికే యువకుడు అదృష్టవశాత్తూ సురక్షితంగా బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
వినాయక నిమజ్జనాల కోసం అధికారులు నిర్దేశించిన ప్రాంతాల్లోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచిస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో, ముఖ్యంగా వంతెనలపై నుంచి నిమజ్జనం చేయడం ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని అధికారులు, స్థానికులు హెచ్చరిస్తున్నారు. నిమజ్జన వేడుకల్లో భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ నిర్వాహకులు, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతున్నారు.
Loading Tweet...




















