Telangana Political Survey 2026 | సెప్టెంబర్ 01 (జనవాణి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ.. రాష్ట్ర రాజకీయాలపై చాణక్య స్ట్రాటజీస్ సర్వే కీలక అంశాలను వెల్లడించింది. గత రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను సేకరించినట్లు పేర్కొన్న సంస్థ.. సంక్షేమ పథకాల అమలు, నిరుద్యోగం, రైతుల సమస్యలు, ప్రతిపక్షాల పరిస్థితి, యువత నాడిపై అధ్యయనం చేసినట్లు తెలిపింది.
బీఆర్ఎస్‌దే స్వల్ప ఆధిక్యం
రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తారని ప్రజలను ప్రశ్నించగా.. బీఆర్ఎస్ 40.7 శాతం ఓటు మద్దతుతో ముందంజలో ఉన్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌కు 37.1 శాతం, బీజేపీకి 14.1 శాతం మద్దతు లభించినట్లు నివేదిక పేర్కొంది. 8.1 శాతం మంది ఏ పార్టీకి ఓటు వేయబోమని చెప్పినట్లు తెలిపింది. బీఆర్ఎస్ గ్రాఫ్ కాంగ్రెస్ కంటే పెరిగినప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పూర్తిస్థాయిలో తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆ పార్టీ ఇంకా వెనుకబడే ఉందని సర్వే విశ్లేషించింది. మరోవైపు బీజేపీకి ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ.. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఆ పార్టీ గ్రాఫ్ గతంతో పోలిస్తే తగ్గినట్లు పేర్కొంది.
50 ఏళ్లు దాటినవారు బీఆర్ఎస్ వైపు
వయసు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఓటర్ల అభిప్రాయాలను పరిశీలిస్తే.. 50 ఏళ్లు పైబడిన ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వే వెల్లడించింది. యువత, ముఖ్యంగా జెన్-జీ ఓటర్లు, ప్రస్తుతం ఏ పార్టీ వైపు స్పష్టంగా మొగ్గు చూపడం లేదని పేర్కొంది. వారు బలమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో బీపీఎల్ వర్గాల ఓటర్లు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న (APL)వర్గాల్లో మాత్రం స్పష్టమైన రాజకీయ మొగ్గు కనిపించడం లేదని వెల్లడించింది.
కాంగ్రెస్‌కు కలిసొచ్చిన సంక్షేమ పథకాలు
కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు సానుకూలంగా మారుతున్నాయని సర్వే తెలిపింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతుల పంటలకు బోనస్, రైతు రుణమాఫీ వంటి పథకాలు ప్రజల్లో ఆదరణ పొందినట్లు పేర్కొంది. అలాగే మహిళల స్వయం ఉపాధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, కొంతమేర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా ప్రభుత్వానికి అనుకూల అంశాలుగా ఉన్నాయని నివేదిక తెలిపింది.
హామీల అమలుపై అసంతృప్తి
అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కూడా పలు కారణాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉందని తెలిపింది. నిరుద్యోగ భృతిపై స్పష్టత లేకపోవడం, రైతుబంధు, రైతుబీమా విషయంలో నెలకొన్న గందరగోళం కూడా ప్రభుత్వానికి ప్రతికూలంగా మారుతున్నాయని పేర్కొంది.హైడ్రా చర్యల ప్రభావంతో రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న పరిస్థితులు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడం, స్థానిక ఎమ్మెల్యేలు యువతను ఆకర్షించేలా పనిచేయడం లేదనే అభిప్రాయం కూడా ప్రభుత్వానికి సవాళ్లుగా ఉన్నట్లు సర్వే తెలిపింది.
మహిళలకు హామీ ఇచ్చిన రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, స్కూటీ వంటి అంశాలు అమలు కాకపోవడంపై కూడా అసంతృప్తి పెరుగుతోందని పేర్కొంది. అలాగే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కాంగ్రెస్ విఫలమవుతోందని, '22A' భూముల సమస్య సామాన్యుల్లో ఆందోళనకు కారణమవుతోందని నివేదిక పేర్కొంది.
జెన్-జీ, పట్టణ ఓటర్లే కీలకం?
మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో సంక్షేమ పథకాల ద్వారా కొన్ని వర్గాల మద్దతును పొందినప్పటికీ.. యువత, పట్టణ ఓటర్ల ఆకాంక్షలను అందుకోవాల్సిన అవసరం ఇంకా ఉందని సర్వే విశ్లేషించింది. ముఖ్యంగా జెన్-జీ ఓటర్లు ఏ వైపు మొగ్గుతారు? రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది? అనే అంశాలు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశముందని పేర్కొంది.






















