తెలంగాణ దేవాదాయ శాఖలో మరోసారి పదోన్నతుల పండుగ నెలకొంది. హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో 51 మంది ఉద్యోగులకు కార్యనిర్వహణాధికారులుగా (ఈవోలు) పదోన్నతి ఉత్తర్వులు అందజేయగా, మరో 15 మంది అర్చకులు, వారి కుటుంబ సభ్యులకు సంక్షేమ నిధి కింద వివిధ ఆర్థిక ప్రయోజనాల మంజూరు ఉత్తర్వులను మంత్రి కొండా సురేఖ అందజేశారు.
హైదరాబాద్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో బుధవారం దేవాదాయ శాఖ ఉద్యోగుల పదోన్నతుల కార్యక్రమం ఘనంగా జరిగింది. అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై పదోన్నతి ఉత్తర్వులను అందజేశారు.
ఈ సందర్భంగా 48 మంది ఉద్యోగులకు గ్రేడ్-3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా (ఈవోలు), ఇద్దరికి గ్రేడ్-2 ఈవోలుగా, ఒకరికి గ్రేడ్-1 ఈవోగా పదోన్నతి కల్పించారు. అలాగే అర్చక సంక్షేమ నిధి ద్వారా అర్హులైన 15 మంది అర్చకులు, వారి కుటుంబ సభ్యులకు పదవీ విరమణ గ్రాట్యుటీ, మరణ గ్రాట్యుటీ, వివాహ రుణం మంజూరు ఉత్తర్వులను మంత్రి అందజేశారు.
ఇప్పటికే 168 మందికి పదోన్నతులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 కేటగిరీల్లో మొత్తం 168 మంది ఉద్యోగులకు ఈవోలుగా పదోన్నతులు కల్పించినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. దీంతో ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు.
అలాగే ఇటీవల వేదపండితులు, అర్చకులు, పరిచారకులు, డోలు, సన్నాయి కళాకారులు తదితర 191 మంది ధార్మిక సిబ్బందికి నియామక ఉత్తర్వులు అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇది ప్రభుత్వం దేవాదాయ శాఖకు ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని అన్నారు.
అర్చకుల సంక్షేమానికి ప్రాధాన్యం
అర్చక సంక్షేమ నిధి కింద పదవీ విరమణ, మరణ గ్రాట్యుటీని ₹8 లక్షల నుంచి ₹12 లక్షలకు పెంచామని మంత్రి తెలిపారు. అలాగే అంత్యక్రియల సహాయాన్ని ₹20 వేల నుంచి ₹30 వేలకు పెంచి అర్చక కుటుంబాలకు మరింత భరోసా కల్పించినట్లు చెప్పారు.
దేవాదాయ శాఖలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఇకపై స్వాతంత్ర్య దినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులు, రివార్డులు అందించేలా కార్యాచరణ రూపొందించాలని దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావుకు మంత్రి సూచించారు.
పుష్కరాలకు ప్రత్యేక ప్రణాళిక
సరస్వతి నది పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వం, 2027 గోదావరి పుష్కరాలు, 2028 కృష్ణా పుష్కరాల నిర్వహణ కోసం ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు ప్రారంభించిందని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పుష్కరాల నిర్వహణలో తెలంగాణ ప్రత్యేక గుర్తింపు సాధించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఉద్యోగుల ప్రశంసలు
దశాబ్దాలుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు గుర్తింపు లభించడంతో పలువురు భావోద్వేగానికి గురయ్యారు. తమకు పదోన్నతులు కల్పించిన మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావుకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ (SITA) డైరెక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు, ఆర్జేసీ రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్ వినోద్ రెడ్డి, అడిషనల్ కమిషనర్లు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.




















