హైదరాబాద్, సెప్టెంబర్ 17 (జనవాణి): తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియకు కసరత్తు ప్రారంభమైంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల జాబితాను రూపొందించేందుకు షెడ్యూల్ విడుదలైంది.
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రెండు స్థానాల ప్రస్తుత పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2026 నవంబర్ 1ను అర్హత తేదీగా తీసుకుని కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు.
ఓటర్ల నమోదు షెడ్యూల్ ఇదే..
సెప్టెంబర్ 28: ఓటర్ల నమోదుకు పబ్లిక్ నోటీసు
సెప్టెంబర్ 28–నవంబర్ 6: పట్టభద్రుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
నవంబర్ 20: ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ, ముద్రణ పూర్తి
నవంబర్ 25: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
నవంబర్ 25–డిసెంబర్ 10: అభ్యంతరాల స్వీకరణ
డిసెంబర్ 30: తుది ఓటర్ల జాబితా విడుదల
పాత ఓటర్లు కూడా కొత్తగా దరఖాస్తు చేయాలి
ఈసారి పట్టభద్రుల ఓటర్ల జాబితాను మొదటి నుంచి పూర్తిగా కొత్తగా రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు. అందువల్ల గతంలో ఓటర్లుగా నమోదైన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సవరించిన ఫారం-18ను పూర్తి చేసి, విద్యార్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా జత చేయాలని సూచించారు. గత ఓటర్ల జాబితాలోని వివరాలను ఈసారి పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు కొత్తగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు సీఈవో తెలంగాణ వెబ్‌సైట్ (https://ceotelangana.nic.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత ఎన్నికల అధికారులకు ఫారం-18తో పాటు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించవచ్చు. పోస్టు ద్వారా కూడా దరఖాస్తులు పంపేందుకు అవకాశం కల్పించారు.




















