హైడ్రా కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్‌ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆశ్రయించింది. ఆయన స్థానంలో అర్హత కలిగిన ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది. రంగనాథ్‌పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. ఇలాంటి అధికారి అదే పదవిలో కొనసాగితే 'రూల్ ఆఫ్ లా'కు విఘాతం కలుగుతుందని వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితుల్లో రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్‌గా కొనసాగించడం సమంజసం కాదని.. ఆయన్ను తొలగించడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది.
మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంట సర్వే నంబర్లు 1, 2లోని 40 ఎకరాల భూమికి సంబంధించి కోర్టు ధిక్కరణ పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఒకే అంశంపై పదే పదే కోర్టు ఆదేశాల ఉల్లంఘన జరగడంపై ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. రంగనాథ్‌పై ఇప్పటికే 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని పేర్కొంది. ఇన్ని కేసులు ఎందుకు నమోదయ్యాయని ప్రశ్నించింది. న్యాయస్థానం ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం వెనుక కారణమేంటని నిలదీసింది. దీనికి రంగనాథ్ క్షమాపణ కోరుతూ.. న్యాయవ్యవస్థపై తనకు పూర్తిగా గౌరవం ఉందని తెలిపారు. లోతుకుంట భూముల్లోకి హైడ్రా ప్రవేశించలేదని వివరించారు. ఈ మేరకు ఆయన అఫిడవిట్ దాఖలు చేయగా.. ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
లోతుకుంట భూములకు సంబంధించి సుప్రీంకోర్టు స్టేటస్ కో అమల్లో ఉండగా.. హైడ్రా అక్కడకు వెళ్లడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ ప్రైవేటు భూముల్లో జోక్యం చేసుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ప్రభుత్వమైనా, ప్రభుత్వ అధికారులైనా చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేసింది. పదేపదే కోర్టు ధిక్కరణలు జరుగుతున్న నేపథ్యంలో రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో అర్హత కలిగిన ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సీఎస్‌ను ఆదేశించింది.




















