హైదరాబాద్, ఆగస్టు 20 (జనవాణి): తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్‌ఆర్ (Outer Ring Road) పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌లో అర్హులైన లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఈ ప్రక్రియను ఆగస్టు 27 నుంచి 30 వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పీ. గౌతం తెలిపారు. ప్రతి రోజు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున లాటరీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పూర్తి పారదర్శకతతో ప్రక్రియ చేపట్టేందుకు రెవెన్యూ, హౌసింగ్ బోర్డు అధికారులతో పాటు మీడియా సమక్షంలో డ్రా నిర్వహించనున్నారు. లాటరీని యూట్యూబ్ తదితర మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.
ఆగస్టు 23 వరకు అభ్యంతరాలు
ఓఆర్‌ఆర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణ లక్ష్యంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఇళ్ల కోసం హౌసింగ్ బోర్డు డిమాండ్ సర్వే నిర్వహించింది. ఆన్‌లైన్, వాట్సాప్ మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. దరఖాస్తుదారులు హైదరాబాద్‌లో స్థిర నివాసం కలిగి ఉన్నారా? ఓఆర్‌ఆర్ పరిధిలో వారికి ఇప్పటికే ప్లాట్ లేదా ఫ్లాట్ ఉందా? తదితర అంశాలను పరిశీలించి అర్హుల జాబితాను రూపొందిస్తున్నారు. దరఖాస్తుదారుల వివరాలను ఆగస్టు 20 సాయంత్రం నుంచి తెలంగాణ మీ సేవ, టీజీ హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 23 సాయంత్రం వరకు తెలియజేయవచ్చు. అభ్యంతరాల పరిశీలన అనంతరం అర్హుల తుది జాబితాను ఆగస్టు 25న ప్రకటించనున్నారు.
రిజర్వేషన్ల ప్రకారం లాటరీ
ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు తదితర వర్గాలకు ముందుగా ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం లాటరీ నిర్వహించనున్నారు. ప్రతి కేటగిరీలో 20 శాతం వెయిటింగ్ లిస్ట్‌ను కూడా రూపొందిస్తారు. వెయిటింగ్ లిస్ట్ ఎంపిక కూడా లాటరీ ద్వారానే చేపట్టనున్నట్లు వి.పీ. గౌతం తెలిపారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియపై ఎలాంటి అపోహలకు గురికావద్దని, అర్హుల గుర్తింపు నుంచి లాటరీ వరకు ప్రతి దశను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని వివరాల కోసం హౌసింగ్ బోర్డు కాల్ సెంటర్ 040-24603572ను సంప్రదించవచ్చని తెలిపారు.




















