ఇకనైనా జర్నలిస్టులకు ఆరోగ్య భరోసా కల్పించాలి: టీయూడ‌బ్ల్యూజే

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా జర్నలిస్టులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరోగ్య పథకం హామీ అమలు కాకపోవడం విచారకరమని TUWJ రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు కూడా ఆరోగ్య పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

10 సెప్టెంబర్, 2026 9:42 AM•ByNarender Kumar Nangunoori

Share this article

ఇకనైనా జర్నలిస్టులకు ఆరోగ్య భరోసా కల్పించాలి: టీయూడ‌బ్ల్యూజే

ఆదిలాబాద్,సెప్టెంబర్ 9 (జనవాణి): జర్నలిస్టులకు ఇచ్చిన ఆరోగ్య పథకం హామీని తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలు కాకపోవడం బాధాకరమన్నారు.

ఆదిలాబాద్ పట్టణంలోని తరంగిణి ఫంక్షన్ హాలులో బుధవారం జరిగిన TUWJ ఆదిలాబాద్ జిల్లా మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలులో లేకపోవడంతో అనారోగ్యానికి గురైన జర్నలిస్టులు వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందే ఆర్థిక స్థోమత లేక ఇప్పటికే పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని విరాహత్ అలీ పేర్కొన్నారు. ఆరోగ్య పథకం అమలు చేయాలని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఇప్పటివరకు ఫలితం లేకపోయిందన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ఆరోగ్య భరోసా కల్పించాలని కోరారు.

అక్రెడిటేషన్ కార్డుల మంజూరులో కొన్ని జిల్లాల కలెక్టర్లు అనవసరంగా జాప్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జర్నలిస్టులకు వెంటనే అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వ్యవహారశైలిపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 15 మంది జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడంతో పాటు, వారికి మంజూరైన అక్రెడిటేషన్ కార్డులను తీసుకోవడం సహించరానిదన్నారు. కేసులను వెంటనే ఉపసంహరించుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

TUWJ Union

జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అక్రెడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో విచారణ చేయించడం సరికాదన్నారు. ఈ అధికారుల వ్యవహారశైలిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం జర్నలిజం వృత్తిపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్న నేపథ్యంలో జర్నలిస్టులు నైతిక విలువలకు కట్టుబడి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని విరాహత్ అలీ సూచించారు.

ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరి శేఖర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో దశాబ్దాలుగా జర్నలిస్టుల సంఘం బలోపేతంగా కొనసాగుతోందన్నారు. కొత్తగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.

కార్యక్రమంలో TUWJ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల రవీందర్, ప్రకాష్ రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం నాయకుడు హన్మంత్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్, కార్యదర్శి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన సుమారు 200 మంది జర్నలిస్టులు హాజరయ్యారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు