మంచిర్యాల,సెప్టెంబర్ 04 (జనవాణి): కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా వర్గపోరు లేదని తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. నేతలంతా కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. శుక్రవారం మంచిర్యాలలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు.
22ఏ భూముల సమస్యపై కీలక వ్యాఖ్యలు
22ఏ భూముల సమస్య గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పడిందని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం పునఃపరిశీలిస్తోందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కాళేశ్వరంపై హరీశ్‌రావును ప్రశ్నించిన వివేక్
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసని మంత్రి అన్నారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయిందో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ప్రజలకు సమాధానం చెప్పాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.




















