హైదరాబాద్, సెప్టెంబర్ 01 (జనవాణి): తెలంగాణ సచివాలయ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమబాట పట్టారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఉద్యోగులు విధులు బహిష్కరించి భారీ మహాధర్నా, ర్యాలీ నిర్వహించారు. సచివాలయంలోని ప్రధాన ద్వారం బాహుబలి గేటు వద్ద ఉద్యోగులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బాహుబలి గేటు నుంచి మీడియా లాంజ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో నూతన పీఆర్‌సీ నివేదికను త్వరితగతిన ప్రకటించడం, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను వెంటనే విడుదల చేయడం, వివిధ రకాల ఆర్థిక బకాయిలను చెల్లించడం ఉన్నాయి. అలాగే అన్ని శాఖల్లో నిలిచిపోయిన ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, అంతర్గత ఉద్యోగ సమస్యలపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరారు. ఈ మహాధర్నాకు తెలంగాణ సచివాలయ అధికారుల సంఘం, తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సహకార పరపతి సంఘం, తెలంగాణ సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం, క్లాస్-4 ఉద్యోగుల సంక్షేమ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. తమ సమస్యలపై పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ స్పందన రాకపోవడంతోనే ఆందోళనకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ధర్నాలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గిరి శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి ప్రేమ్, అధికారుల సంఘం అధ్యక్షుడు జి. సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి పి. లింగమూర్తి, కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు రేండ్ల రాజేష్, ఉపాధ్యక్షుడు టి. జయహరి గౌడ్, కార్యదర్శి టి. స్వరణ్ రాజ్, మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు కే. రమాదేవి, కార్యదర్శి నివేదిత, క్లాస్-4 ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పి. రాజకుమార్, కార్యదర్శి సాయికుమార్‌తో పాటు వివిధ సంఘాల నాయకులు, కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




















