పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

2026-27 పత్తి సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు నిర్వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. 15–30 రోజుల్లో అన్ని జిల్లాల్లో మిల్లులు ప్రారంభించాలని, మానిటరింగ్‌ కమిటీల్లో రైతులకు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు.

11 ఆగస్టు, 2026 6:34 PM•ByRalin

Share this article

పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సీసీఐ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, ఆగస్టు 11 (జనవాణి): రానున్న 2026-27 పత్తి సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతులకు కనీస మద్దతు ధర (MSP) పూర్తిస్థాయిలో అందేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో పత్తి కొనుగోలు ఏర్పాట్లపై సీసీఐ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కష్టపడి పంట పండించిన రైతులకు మార్కెటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్నారు. ఒకరిద్దరి కారణంగా మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు రాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ‘‘మనం బతకాలంటే రైతు బతకాలి’’ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని పనిచేయాలని అన్నారు.

25.85 లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అంచనా

2026-27 సీజన్‌లో రాష్ట్రంలో సుమారు 46.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని, దాదాపు 25.85 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. లాంగ్‌ స్టేపుల్‌ కాటన్‌కు కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.8,667 కనీస మద్దతు ధర (MSP) ప్రకటించిందని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే MSP రూ.557 పెరిగిందన్నారు.

అర్హత కలిగిన ప్రతి రైతుకు MSP ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని.. రైతులు MSP కంటే తక్కువ ధరకు పత్తిని విక్రయించే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదని ఆదేశించారు. కొనుగోళ్లలో మధ్యవర్తుల జోక్యానికి అవకాశం ఇవ్వకుండా రైతుల నుంచి నేరుగా, పారదర్శకంగా పత్తి కొనుగోలు జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు.

15–30 రోజుల్లో మిల్లులు ప్రారంభించాలి

రాష్ట్రంలోని 356 జిన్నింగ్‌ మిల్లులను నోటిఫై చేసి పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. L1 నుంచి L12 వరకు అన్ని కేటగిరీల మిల్లులను అవసరానికి అనుగుణంగా ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 15 నుంచి 30 రోజుల వ్యవధిలో అన్ని జిల్లాల్లో మిల్లులు అందుబాటులోకి వచ్చేలా చూడాలని అన్నారు.

గత సీజన్‌లో 122 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఉండగా.. ఈ సీజన్‌లో వాటి సంఖ్యను 131కు పెంచినట్లు మంత్రి తెలిపారు. అన్ని కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పత్తి రాక అధికంగా ఉండే ప్రాంతాల్లో అవసరమైన మేరకు అదనపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

మానిటరింగ్‌ కమిటీల్లో రైతులకు చోటు

ప్రతి జిల్లాలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మానిటరింగ్‌ కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కమిటీల్లో రైతు ప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు.

మార్కెట్‌ యార్డులు, జిన్నింగ్‌ మిల్లుల వద్ద పత్తి రాకను క్రమబద్ధీకరించాలని అన్నారు. అవసరమైతే సాయంత్రం 6 గంటల తర్వాత కూడా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొనుగోలు సమయాన్ని పొడిగించాలని సూచించారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు.

కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుకింగ్‌ సరళీకృతం

కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్లు ఓపెన్‌ చేసే ముందు కలెక్టర్లు, జిల్లా మార్కెటింగ్‌ అధికారులకు సమాచారం ఇచ్చి రైతులకు విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని మరింత సరళీకృతం చేయడంతోపాటు ఒక రైతు లేదా మొబైల్‌ నంబర్‌కు అవసరమైన విధంగా మల్టిపుల్‌ బార్‌కోడ్‌ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.

పంట బుకింగ్‌ డేటాను ఎన్‌ఐసీ ద్వారా కపాస్‌ కిసాన్‌ యాప్‌కు వేగంగా బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా సగటు దిగుబడిని ప్రకటించి, అంతకంటే అధిక దిగుబడి సాధించిన రైతులకు ఏఈఓల ద్వారా డిజిటల్‌ యీల్డ్‌ సర్టిఫికెట్లు వెంటనే జారీ చేయాలని తెలిపారు.

నాణ్యత పరీక్షలకు ప్రత్యేక ఏర్పాట్లు

పత్తి అధికంగా ఉత్పత్తి అయ్యే జిల్లాల్లో అవసరమైన మేరకు కాటన్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అన్ని నోటిఫైడ్‌ జిన్నింగ్‌ మిల్లుల్లో Staple Length, Micronaire, తేమ శాతం తదితర నాణ్యత ప్రమాణాలను పరీక్షించే పరికరాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

అన్ని కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని, బరువు కొలిచే యంత్రాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. గత సీజన్లలో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం గుర్తించిన లోపాలను పరిగణనలోకి తీసుకుని ఈసారి అవకతవకలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

రైతుల కోసం హెల్ప్‌లైన్‌, వాట్సాప్‌ సేవలు

రైతులకు MSPపై పూర్తి అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. రైతు నేస్తం, గ్రామస్థాయి కార్యక్రమాలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా MSP, కొనుగోలు కేంద్రాలు, నాణ్యత ప్రమాణాలు, స్లాట్‌ బుకింగ్‌ విధానంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.

రైతుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం 1800 599 5779 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌, 88972 81111 వాట్సాప్‌ చాట్‌బాట్‌ సేవలను రైతులు వినియోగించుకునేలా ప్రచారం చేయాలని చెప్పారు. ప్రతి మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన డెడికేటెడ్‌ హెల్ప్‌డెస్క్‌లను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు

కొనుగోలు కేంద్రాల్లో రద్దీ లేదా పెండింగ్‌ ఏర్పడితే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలు, సీసీఐ, ఇతర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.

రైతుకు MSP అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తుమ్మల స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ స్థాయిలోనైనా నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగితే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. పత్తి కొనుగోళ్లలో రైతులకు నష్టం కలిగించే చర్యలు, అవకతవకలు చోటుచేసుకుంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు