తిరుమల,సెప్టెంబర్ 22 (జనవాణి): తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం అలిపిరి నడక మార్గంలో వెళ్తున్న భక్తులకు చిరుత కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. 2700వ మెట్టు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ చెట్టుపై చిరుతను భక్తులు గుర్తించారు.
చెట్టుపై చిరుతను చూసిన భక్తులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. వెంటనే సమీపంలోని భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో టీటీడీ విజిలెన్స్, అటవీశాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే సిబ్బంది అక్కడికి చేరుకునే సమయానికి చిరుత చెట్టుపై నుంచి దిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో నడక మార్గంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
చిరుత సంచారం నేపథ్యంలో అలిపిరి నడక మార్గంలో భక్తులను గుంపులుగా తిరుమలకు పంపిస్తున్నారు. ఎవరూ ఒంటరిగా నడక మార్గంలో వెళ్లవద్దని, తప్పనిసరిగా గుంపులుగా వెళ్లాలని భద్రతా సిబ్బంది భక్తులకు సూచిస్తున్నారు.





















