తిరుమల, ఆగస్టు 06 (జనవాణి): తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త అందించింది. 2026 వార్షిక పుష్పయాగం సేవ టికెట్లను ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్‌సైట్ (https://ttdevasthanams.ap.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక సేవ నవంబర్ 16న తిరుమలలో నిర్వహించబడగా, దానికి ఒక రోజు ముందు అంటే నవంబర్ 15న అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది.
ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల అనంతరం, శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణ నక్షత్రం సందర్భంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. శాస్త్రోక్తంగా జరిగే ఈ సేవ ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధులు వంటి విపత్తులు తొలగి, ప్రపంచానికి శాంతి, శ్రేయస్సు కలగాలని స్వామివారిని ప్రార్థిస్తారు. ఈ సేవకు ఒక్కో టికెట్ ధర రూ.700గా నిర్ణయించగా, సుమారు 1,000 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచనున్నారు. టికెట్లు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే లభిస్తాయి. ఒక మొబైల్ నంబర్‌తో గరిష్టంగా ఇద్దరికీ మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. 12 ఏళ్లలోపు పిల్లలకు ప్రత్యేక టికెట్ అవసరం లేదు.
ఒకేరోజు రెండుసార్లు స్వామీ వారి దర్శనం
పుష్పయాగం సేవలో పాల్గొనే భక్తులకు ఒకే రోజు రెండుసార్లు శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించడం ఈ సేవ ప్రత్యేకత. ఉదయం సేవల అనంతరం ఒకసారి, మధ్యాహ్నం పుష్పయాగం పూర్తయ్యాక మరోసారి శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ రెండు దర్శనాలు కూడా జయ-విజయుల గడప నుంచి సాధారణ దర్శనం కల్పిస్తారు.
ఈ నిబంధన తప్పనిసరి
ఈ సంవత్సరం నవంబర్ 16కు ముందు 180 రోజుల వ్యవధిలో ఏదైనా ఆర్జిత సేవలో పాల్గొన్న భక్తులు పుష్పయాగం టికెట్‌కు అర్హులు కారు. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, వసంతోత్సవం, జ్యేష్టాభిషేకం, పవిత్రోత్సవం వంటి సేవల్లో పాల్గొన్న భక్తులు ఈ టికెట్ బుక్ చేసుకునేందుకు అర్హులు కారు అని టీటీడీ కండిషన్ పెట్టింది. అయితే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్ సేవలు, లక్కీ డిప్ ద్వారా పొందిన సేవలకు ఈ నిబంధన వర్తించదు.
పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లు అందుబాటులో ఉండటంతో, భక్తులు ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు ముందుగానే టీటీడీ అధికారిక వెబ్‌సైట్ (https://ttdevasthanams.ap.gov.in) లేదా మొబైల్ యాప్‌లో లాగిన్ అయి సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు.




















