తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నటి త్రిషపై పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తంజావూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ కోసం తరలించారు.
తంజావూరులో కావేరీ జలాల అంశంపై నిర్వహించిన డీఎంకే నిరసన సభలో ప్రసంగించిన ఉదయనిధి స్టాలిన్, త్రిష పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. సభలో త్రిష పేరుతో నినాదాలు వినిపించగా, వాటికి స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ద్వంద్వార్థం కలిగించేలా ఉన్నాయంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై పలువురు తంజావూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు చెన్నైలోని ఉదయనిధి నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం తంజావూరుకు తరలించారు.
మరోవైపు ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు. డీఎంకే లీగల్ సెల్ బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యాహ్నం విచారణకు రానుంది. అలాగే ఉదయనిధిపై టీవీకే మహిళా కమిషన్‌కు టీవీకే ఫిర్యాదు చేసింది.. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తాజా పరిణామాల నేపథ్యంలో చెన్నైలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఉదయనిధి నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. టీవీకే శ్రేణులు ఉదయనిధి ఇంటి ముట్టడికి పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉదయనిధి బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు ఆందోళనలు కొనసాగుతాయని టీవీకే నాయకులు ప్రకటించారు.
ఇక డీఎంకే నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉదయనిధి నివాసానికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు. రాజకీయాల్లో ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని.. డీఎంకే దిగజారుడు రాజకీయాలకు నిదర్శమన్నారు. ఉయదనిధి వ్యాఖ్యలు సిగ్గు చేటని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఊరుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
కావేరీ జలాల సమస్యపై ప్రారంభమైన రాజకీయ పోరు ఇప్పుడు డీఎంకే-టీవీకే మధ్య తీవ్రమైన రాజకీయ వివాదంగా మారింది. ఈ కేసు న్యాయపరంగా, రాజకీయంగా ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.




















