వికారాబాద్,అక్టోబర్ 3 (జనవాణి): అనంతగిరి ఘాట్ రోడ్డులో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఊరి అల్లుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బంధువులతో కలిసి హాజరయ్యేందుకు బయలుదేరారు. మార్గమధ్యలో అనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
అనంతగిరి ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.





















