హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, ఇతర కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.