హైదరాబాద్, ఆగస్టు 4: రైతుల ప్రయోజనాల పరిరక్షణతో పాటు ప్రజాధనాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, ఆహార–పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ప్రతి ధాన్యం గింజకు లెక్క తేల్చడం, కస్టమ్ మిల్లింగ్ వ్యవస్థలో పూర్తి పారదర్శకత తీసుకొస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ధాన్యం, బియ్యం నిల్వలను దారి మళ్లించడం, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలను పేరుకుపోయేలా చేయడం వంటి అక్రమాలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని స్పష్టం చేశారు.
ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, ప్రభుత్వానికి బియ్యం అప్పగింత, సీఎంఆర్ బకాయిల వసూలు, ప్రభుత్వ నిల్వల పరిరక్షణ, డిఫాల్టర్ రైస్ మిల్లులపై చర్యల అంశాలపై ఉన్నతాధికారులతో మంగళవారం నాడు మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు నుంచి ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగించే వరకు మొత్తం వ్యవస్థను సమగ్రంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
రైస్ మిల్లర్లందరికీ వ్యతిరేకం కాదు
ప్రభుత్వ చర్యలు మొత్తం రైస్ మిల్లింగ్ పరిశ్రమకు వ్యతిరేకంగా కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో వందలాది మంది రైస్ మిల్లర్లు దశాబ్దాలుగా ప్రభుత్వంతో నిజాయితీగా పనిచేస్తూ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు, ప్రజాపంపిణీ వ్యవస్థకు సహకరిస్తున్నారని కొనియాడారు. నిబంధనలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మిల్లర్లకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. అయితే కొందరు మిల్లర్లు ప్రభుత్వ నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ధాన్యం, బియ్యం నిల్వలను దారి మళ్లించడం, నిర్ణీత గడువులో సీఎంఆర్‌ను అప్పగించకపోవడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లడంతో పాటు చివరకు ఆ భారం ప్రజలపైనే పడుతోందన్నారు.
దేశంలోనే భారీ ధాన్యం కొనుగోలు వ్యవస్థ
దేశంలోనే తెలంగాణ అత్యధికంగా వరి సాగు, ధాన్యం సేకరణ జరిగే రాష్ట్రాల్లో ఒకటని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా కనీస మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి సాధారణంగా 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వ హామీతో బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణంగా తీసుకుని ఈ కొనుగోళ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు అప్పగించి, వారు బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అందజేస్తారని, ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇచ్చి జాతీయ ఆహార భద్రతా చట్టం, ఇతర సంక్షేమ పథకాల కింద పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. మిల్లింగ్‌లో ప్రతి రోజు జాప్యం జరిగినా ప్రభుత్వంపై అదనపు వడ్డీ భారం పడుతుందని గుర్తుచేశారు.
ప్రభుత్వ ఆస్తుల దారి మళ్లింపు తీవ్రమైన నేరం
ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించడం, బియ్యాన్ని దారి మళ్లించడం, సీఎంఆర్‌ను సకాలంలో అప్పగించకపోవడం, తక్కువ పరిమాణంలో బియ్యం ఇవ్వడం, నిల్వలను దాచిపెట్టడం, రికార్డులను తారుమారు చేయడం, స్టాక్ రిజిస్టర్లు సరిగా నిర్వహించకపోవడం వంటి అక్రమాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి చెందిన ప్రతి కిలో ధాన్యం ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఆస్తేనని, అది ప్రభుత్వానికి తిరిగి చేరకపోతే ప్రజాపంపిణీ వ్యవస్థ బలహీనపడుతుందని అన్నారు. ప్రజల పన్నుల సొమ్ముతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని దుర్వినియోగం చేయడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు.
నాలుగు సూత్రాలతో ప్రభుత్వ విధానం
ధాన్యం కొనుగోలు, కస్టమ్ మిల్లింగ్ వ్యవస్థలో ప్రభుత్వం నాలుగు కీలక సూత్రాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగించడం మొదటి లక్ష్యమన్నారు. రెండోది నిబంధనలు పాటించే నిజాయితీ మిల్లర్లకు పూర్తి సహకారం అందించడం అని చెప్పారు. మూడోది మిల్లులకు అప్పగించిన ప్రతి ధాన్యం గింజకు పూర్తి లెక్క ఉండేలా జవాబుదారీతనం తీసుకురావడం కాగా, నాలుగోది ప్రభుత్వ నిల్వలను దారి మళ్లించడం, మోసం, ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడిన వారిపై ఎలాంటి మినహాయింపులు లేకుండా చట్టాన్ని అమలు చేయడమని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ తనిఖీలు
రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో సమగ్ర తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. రైస్ మిల్లుల్లో ప్రత్యక్షంగా నిల్వలు పరిశీలించడం, స్టాక్ రిజిస్టర్లు తనిఖీ చేయడం, సీఎంఆర్ నిల్వలను ధృవీకరించడం, కొనుగోలు రికార్డులను వాస్తవ నిల్వలతో సరిపోల్చడం వంటి చర్యలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ ధాన్యం, బియ్యం నిల్వల దారి మళ్లింపు, కొరత, అనుమానాస్పద లావాదేవీలపై లోతైన విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ప్రభుత్వ ఆస్తుల రికవరీతో పాటు డిఫాల్టర్ మిల్లులను బ్లాక్‌లిస్టులో చేర్చే చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.
సాంకేతికతతో పకడ్బందీ పర్యవేక్షణ
భవిష్యత్తులో అక్రమాలకు అవకాశం లేకుండా ధాన్యం రవాణాను జీపీఎస్ ఆధారిత వ్యవస్థ ద్వారా పర్యవేక్షించడం, నిల్వలను ఆన్‌లైన్‌లో సరిపోల్చడం, రిస్క్ ఆధారిత ఆడిటింగ్, ధాన్యం కొనుగోలు–మిల్లింగ్–ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగింత డేటాను అనుసంధానం చేయడం వంటి సంస్కరణలు అమలు చేస్తామని మంత్రి తెలిపారు. సీఎంఆర్ ఖాతాలను నిర్దిష్ట గడువులోగా సరిచూడడంతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.
మిల్లర్లకు విజ్ఞప్తి.. రైతులకు భరోసా
రైస్ మిల్లర్లు పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని, తనిఖీలకు పూర్తి సహకారం అందించాలని, రికార్డులను పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి కోరారు. చట్టాన్ని పాటించే మిల్లర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే వారిపై మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాష్ట్రంలోని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోలు యథావిధిగా కొనసాగుతుందని, కనీస మద్దతు ధరకు ఎలాంటి భంగం కలగదని, రైతుల ఖాతాల్లో సకాలంలో చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు అనంతరం మిల్లింగ్, నిల్వలు, బియ్యం అప్పగింతలో జరిగే అక్రమాల ప్రభావం రైతులపై పడకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అప్పగించిన ప్రతి ధాన్యం గింజ చివరకు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా, రైతులను రక్షిస్తూ ప్రజాధనాన్ని కాపాడేలా ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని మంత్రి పేర్కొన్నారు.





















