విజయవాడలోని సింగరేణి అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఆప్మెల్) స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన 300 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి బుధవారం వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్లాంట్ ఆవరణలో నిర్మించిన సీసీ, ఆర్‌సీసీ రోడ్లను కూడా ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో సింగరేణితో పాటు అనుబంధ సంస్థల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
రికార్డు స్థాయి టర్నోవర్, లాభాలు
50 ఏళ్ల ఆప్మెల్ చరిత్రలోనే తొలిసారిగా సంస్థ రూ.63.13 కోట్ల టర్నోవర్ సాధించడంతో పాటు రూ.23.33 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడం అభినందనీయమని సీఎండీ పేర్కొన్నారు. ఈ విజయానికి కృషి చేసిన ఉద్యోగులను అభినందించారు.
గత ఏడాది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంస్థను సందర్శించిన సందర్భంగా ఇచ్చిన సూచనలు, మార్గనిర్దేశం ఫలితంగానే సంస్థ ఈ స్థాయికి చేరుకుందని ఆయన తెలిపారు. అలాగే ప్లాంట్‌లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఇచ్చిన హామీ మేరకు సీసీ, ఆర్‌సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు వెల్లడించారు.
సోలార్‌తో ఖర్చు తగ్గింపు
రూ.1.24 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 300 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా సంస్థకు ప్రతి ఏడాది సుమారు రూ.24 లక్షల విద్యుత్ ఖర్చు ఆదా కానుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్లాంట్, కాలనీ అవసరాల కోసం ఏటా సుమారు రూ.60 లక్షల వరకు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఐదేళ్లలో పెట్టుబడిని తిరిగి రాబట్టే అవకాశం ఉందన్నారు. పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తికి కూడా ఇది దోహదపడుతుందని వివరించారు.
వ్యాపార విస్తరణపై దృష్టి
సెప్టెంబర్ 1, 1976న ప్రారంభమైన ఆప్మెల్ ఈ ఏడాది స్వర్ణోత్సవాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులు, సాంకేతికతలను అందిపుచ్చుకుని వ్యాపార విస్తరణపై దృష్టి సారించాలని సీఎండీ సూచించారు. సంస్థ ఆధునీకరణ, సాంకేతిక అభివృద్ధికి సింగరేణి అన్ని విధాలుగా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.
ఆప్మెల్ చైర్మన్ ఎన్‌వీకే శ్రీనివాస్ మాట్లాడుతూ, సింగరేణి, కోల్ ఇండియా, ఎన్ఎండీసీ వంటి సంస్థల నుంచి వచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేశామని తెలిపారు. భవిష్యత్తులో సంస్థను మరింత విస్తరించే కార్యాచరణను అమలు చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు, సింగరేణి ఉన్నతాధికారులు, ఆప్మెల్ ఎండీ ఎర్రన్నతో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.




















