అమరావతి రైతుల త్యాగానికి పాదాభివందనం: సీఎం చంద్రబాబు

అమరావతి రాజధాని అభివృద్ధిలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ ఈ-3 రెండో దశను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రూ.1,519 కోట్లతో నిర్మించిన ఈ 21.77 కిలోమీటర్ల కారిడార్ రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలవనుంది. ఈ సందర్భంగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను సీఎం కొనియాడుతూ వారికి పాదాభివందనం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

13 ఆగస్టు, 2026 3:20 PM•ByNarender Kumar Nangunoori

Share this article

అమరావతి రైతుల త్యాగానికి పాదాభివందనం: సీఎం చంద్రబాబు

అమరావతి, ఆగస్టు 13 (జనవాణి): అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. రాజధానిని ప్రధాన ప్రాంతాలతో అనుసంధానించే సీడ్ యాక్సెస్ రోడ్ ఈ-3 రెండో దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. ఉండవల్లి వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానంగా నిర్మించనున్న స్టీల్ బ్రిడ్జీలకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి వరకు ఈ దశలో రహదారి నిర్మాణం పూర్తయింది. మొత్తం రూ.1,519 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ కారిడార్‌లో 21.77 కిలోమీటర్ల మేర 60 మీటర్ల వెడల్పుతో రహదారిని అభివృద్ధి చేస్తున్నారు. మూడు దశల్లో నిర్మిస్తున్న ఈ మార్గంలో 9 లేన్ల రహదారితో పాటు బీఆర్‌టీఎస్ కారిడార్, సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేశారు. విజయవాడ-మంగళగిరి హైవేతో అనుసంధానానికి ప్రత్యేక బ్రిడ్జిని కూడా నిర్మించారు. మూడో దశలో మణిపాల్ వద్ద జాతీయ రహదారి-16కు అనుసంధానం చేసేలా ప్రణాళిక రూపొందించారు. స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే అమరావతికి మరింత మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.

రైతుల త్యాగానికి పాదాభివందనం

సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభోత్సవ సభలో చంద్రబాబు భావోద్వేగంగా మాట్లాడారు. అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను కొనియాడుతూ వారికి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి విజన్‌లో అమరావతి నిర్మాణం తొలి విజయమని చంద్రబాబు పేర్కొన్నారు. విభజన తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిన నేపథ్యంలో విస్తృత చర్చల అనంతరం అమరావతిని రాజధానిగా నిర్ణయించామని చెప్పారు. ప్రభుత్వంపై నమ్మకంతో రైతులు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చారని గుర్తుచేశారు. 2019-24 మధ్య అమరావతి కోసం రైతులు చేసిన ఉద్యమాన్ని చరిత్ర ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. అమరావతి నిర్మాణం కోసం దేశంలోని పవిత్ర నదులు, పుణ్యక్షేత్రాల నుంచి నీరు, మట్టిని తీసుకొచ్చి ఇక్కడ కలిపామని తెలిపారు.

‘గ్రాఫిక్స్’ అంటూ ఎగతాళి చేసినవారు తలదించుకోవాలి

అమరావతి మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో సింగపూర్ సహకరించిందని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ భవనాలు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థతో డిజైన్లు రూపొందించామని తెలిపారు. అప్పుడు కొందరు అమరావతి ప్రణాళికలను ‘గ్రాఫిక్స్’ అంటూ ఎగతాళి చేశారని, ఇప్పుడు అవే ప్రణాళికలు సాకారం అవుతుంటే ఎగతాళి చేసిన వారు తలదించుకోవాలని వ్యాఖ్యానించారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమగ్ర అభివృద్ధిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ కావాలన్నదే నా ఆకాంక్ష అని తెలిపారు. అమరావతిని ఆహ్లాదకరమైన, ఆధునిక రాజధానిగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు