ఆగస్టులో అమరావతిలో రెండు కీలక ప్రారంభాలు.. చంద్రబాబు నాయుడు వెల్లడి

అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు నెలలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను ప్రారంభించి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

8 ఆగస్టు, 2026 4:02 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఆగస్టులో అమరావతిలో రెండు కీలక ప్రారంభాలు.. చంద్రబాబు నాయుడు వెల్లడి

Janavaani Iage

అమరావతి,ఆగస్టు 8 (జనవాణి): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు నెలలోనే రెండు ముఖ్యమైన ప్రారంభాలు జరుగుతాయని చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన ఈ విషయాలను తెలిపారు.

అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్‌ను ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. అమరావతి పనులు వర్షాకాలంలోనూ వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే అమరావతిలో సీఆర్డీఏ భవనం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో రెండు కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి.

సీడ్ యాక్సెస్ రోడ్డు

మరోవైపు రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సీడ్ యాక్సెస్ రోడ్డును ఆగస్టు 13న ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే ప్రకాశం బ్యారేజీ నుంచి కరకట్ట మీదుగా అమరావతికి వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 21 కిలోమీటర్ల మేర సీడ్ యాక్సెస్ రోడ్డును నిర్మించారు. ఫేజ్-1లో 14.35 కి.మీ., ఫేజ్-2లో 3.92 కి.మీ., ఫేజ్-3లో 3.51 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్వార్టర్స్

అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన నివాస సముదాయాల పనులు కూడా పూర్తయ్యాయి. మొత్తం 12 అపార్ట్‌మెంట్ టవర్ల నిర్మాణం పూర్తయింది. వీటిని త్వరలో సాధారణ పరిపాలన శాఖకు అప్పగించనున్నారు. ఈ క్వార్టర్స్‌ను కూడా ఆగస్టులోనే ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో అమరావతిలో ప్రజాప్రతినిధుల నివాస సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

2028 నాటికి తొలి దశ పూర్తి

ఇప్పటికే సీఆర్డీఏ భవనం అందుబాటులోకి రాగా.. తాజాగా సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ క్వార్టర్స్ ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. దీంతో అమరావతి నిర్మాణ పనుల్లో ఆగస్టు నెల కీలకంగా మారనుంది. 2028 నాటికి అమరావతి తొలి దశ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యానికి అనుగుణంగా రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు