అమరావతి అద్భుత నగరం కాదు.. అవినీతి సామ్రాజ్యం.. చంద్రబాబు, నారా లోకేశ్‌పై అంబటి రాంబాబు ఫైర్

అమరావతి నిర్మాణ పనుల్లో భారీగా అవినీతి జరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. 21.77 కి.మీ. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు రూ.1,519 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు.

14 ఆగస్టు, 2026 1:11 PM•ByRalin

Share this article

అమరావతి అద్భుత నగరం కాదు.. అవినీతి సామ్రాజ్యం.. చంద్రబాబు, నారా లోకేశ్‌పై అంబటి రాంబాబు ఫైర్

అంబటి రాంబాబు(ఫైల్ ఫొటో)

గుంటూరు, ఆగస్టు 14 (జనవాణి): “అమరావతి అద్భుత నగరం కాదు.. భారీ దోపిడీ రాజ్యం” అంటూ వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతి నిర్మాణ పనుల్లో అంచనాలను భారీగా పెంచి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యంగా 21.77 కిలోమీటర్ల సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు రూ.1,519 కోట్లు ఖర్చు చేస్తున్నారని పేర్కొంటూ.. ఈ లెక్కలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. అమరావతి పేరుతో జరుగుతున్న వివిధ నిర్మాణ పనుల ఖర్చులను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణ వ్యయంపై అంబటి రాంబాబు కీలక ఆరోపణలు చేశారు. అమరావతి సీడ్‌ నుంచి జాతీయ రహదారి వరకు నిర్మిస్తున్న ఈ రహదారి మొత్తం పొడవు 21.77 కిలోమీటర్లు అని తెలిపారు.

14.21 కిలోమీటర్ల మొదటి దశకు 2017లో రూ.285 కోట్లు మంజూరు చేయగా.. 2019 నాటికి రూ.185 కోట్లు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. దీంతో మిగిలిన పనుల విలువ సుమారు రూ.100 కోట్లు మాత్రమే ఉండగా.. వాటిని ‘రివైవ్‌’ పేరుతో రూ.365 కోట్లకు పెంచారని ఆరోపించారు. జీఎస్టీ, ఇతర ఖర్చులు కలిపి ఆ పనుల విలువ రూ.465 కోట్లకు చేరిందని తెలిపారు. రూ.100 కోట్లతో పూర్తయ్యే పనిని రూ.465 కోట్లకు ఎందుకు పెంచారో చంద్రబాబు ప్రభుత్వం చెప్పాలని అంబటి డిమాండ్‌ చేశారు.

కిలోమీటర్‌కు రూ.180 కోట్లు ఎందుకు?

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు కిలోమీటర్‌కు సుమారు రూ.180 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని అంబటి ఆరోపించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో కిలోమీటర్‌కు సగటున రూ.23-24 కోట్ల వరకు ఖర్చవుతుందని పేర్కొంటూ.. అమరావతి రోడ్డు నిర్మాణంలో ఇంత భారీ వ్యయం ఎందుకని ప్రశ్నించారు.

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద రెండు వైపులా కలిపి 4.8 కిలోమీటర్ల ఫ్లైఓవర్‌కు సుమారు రూ.180 కోట్లు ఖర్చయిందని, అదే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో 3.5 కిలోమీటర్ల ప్యాకేజీకి రూ.532 కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు.

విజయవాడలో 2.6 కిలోమీటర్ల ఆరు లేన్ల కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి అప్పట్లో రూ.282.4 కోట్లు ఖర్చయిందని అంబటి తెలిపారు. అంటే కిలోమీటర్‌కు సుమారు రూ.108.61 కోట్లు అవుతుందని చెప్పారు. అదే సమయంలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో 3.5 కిలోమీటర్ల ఆరు లేన్ల ఫ్లైఓవర్‌కు రూ.610.5 కోట్లు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. అంటే కిలోమీటర్‌కు రూ.180 కోట్ల వరకు వస్తుందని, ఈ వ్యత్యాసానికి కారణమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కుంగిపోయిన తాత్కాలిక స్టీల్‌ బ్రిడ్జికి మరమ్మతుల పేరుతో రూ.80 కోట్లు ఖర్చు చేశారని అంబటి ఆరోపించారు. ఈ బ్రిడ్జిని ప్రారంభించే కార్యక్రమంపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసిందని విమర్శించారు. అమరావతిలో శాశ్వత సచివాలయం నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.18,413 ఖర్చు చేస్తున్నారని అంబటి పేర్కొన్నారు. ఐదు ఐకానిక్‌ భవనాలకు చదరపు అడుగుకు రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు అంచనాలు వేశారని ఆరోపించారు. ఆ ఐదు భవనాల్లో కేవలం గ్లాస్‌ ఫసాడ్‌ కోసం రూ.2,455.22 కోట్లు ఖర్చు చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. రోడ్లు, భవనాల నిర్మాణంలో ఇంత భారీ అంచనాలు ఎందుకని ప్రశ్నించారు.

రైతులకు ప్లాట్లు ఎక్కడ?

రాజధాని కోసం సుమారు 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ పూర్తి స్థాయి లేఅవుట్లు, ప్లాట్లు ఇవ్వలేదని అంబటి విమర్శించారు. రైతులు తమ భూములు ఇచ్చి ఎదురుచూస్తుంటే.. కాంట్రాక్టర్ల పనులకు మాత్రం భారీగా అంచనాలు పెంచుతున్నారని ఆరోపించారు.

అమరావతి పేరుతో అప్పులు తీసుకురావడం, నిర్మాణ పనుల అంచనాలు పెంచడం జరుగుతోందని ఆయన విమర్శించారు. ఇప్పటికే రూ.57 వేల కోట్లు అప్పులు తెచ్చారని, మరో రూ.2 లక్షల కోట్ల అప్పు చేయడానికి ప్రణాళికలు ఉన్నాయని ఆరోపించారు.

‘చంద్రబాబు సమాధానం చెప్పాలి’

అమరావతిలో జరుగుతున్న పనులపై తాను లెక్కలతో ప్రశ్నలు సంధిస్తున్నానని.. వాటికి చంద్రబాబు, లోకేశ్‌ సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు.

అమరావతిని అద్భుత రాజధానిగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. నిర్మాణ పనుల్లో జరుగుతున్న అవకతవకలను వైఎస్సార్‌సీపీ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రశ్నిస్తుందని అంబటి రాంబాబు అన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు