తిరుపతి, ఆగస్టు 15 (జనవాణి): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి ఆనం ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా స్పృహ కోల్పోయి పక్కకు వాలిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన కిందపడకుండా పట్టుకున్నారు. మంత్రి బీపీ డౌన్ అయినట్లు గుర్తించిన వైద్యులు వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. చికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాసేపటి తర్వాత మంత్రి ఆనం తిరిగి స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి ప్రసంగాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కొనసాగించారు.




















