మదనపల్లె,అక్టోబర్ 2 (జనవాణి): ఆంధ్రప్రదేశ్‌ను వ్యవసాయం, ఉద్యానవన రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు మరో కీలక అడుగు పడింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శుక్రవారం శంకుస్థాపన చేశారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కూడా ఈ కార్యక్రమంలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌పై తనకున్న అనుబంధాన్ని వ్యక్తం చేశారు. “ఆంధ్ర భూమి.. సువర్ణ భూమి. నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి. రాష్ట్రానికి నేనేం చేయగలనో గైడ్ చేయాలి” అని సీఎం చంద్రబాబును కోరారు. హార్టికల్చర్ రంగంలో రాష్ట్రానికి మరింత మేలు చేసే కార్యక్రమాలకు భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని అనంత్ అంబానీ పేర్కొన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు.

అనంత్ అంబానీ ప్రసంగానికి ప్రశంసలు
కార్యక్రమంలో అనంత్ అంబానీ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. ప్రసంగం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఆయనను అభినందించారు. అనంతరం సీఎం చంద్రబాబు కూడా అనంత్ అంబానీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. రాయలసీమలో ఉద్యానవన రంగ అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయని కార్యక్రమంలో పాల్గొన్న నేతలు పేర్కొన్నారు.




















