అనంతపురం, సెప్టెంబర్ 16 (జనవాణి): జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులు మృతి చెందగా ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులను గుత్తి మండలానికి చెందిన హరిత, తాడిపత్రి మండలం నిడిగల్లు గ్రామానికి చెందిన నవనీతగా గుర్తించారు. హరిత అనంతపురంలోని ఓ నర్సింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతుండగా నవనీత ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. వీరిద్దరూ గత రెండేళ్లుగా స్నేహితులుగా ఉన్నారు. వీరికి అదే ఆస్పత్రిలో ల్యాబ్‌లో పనిచేసే వినయ్‌కుమార్, బీమా ఏజెంట్ శ్రీధర్‌రెడ్డితో పరిచయం ఉంది. సోమవారం రాత్రి హరిత, నవనీత, వినయ్‌కుమార్, శ్రీధర్‌రెడ్డి కారులో బయటకు వెళ్లారు. మంగళవారం వేకువజామున అనంతపురం వైపు తిరిగి వస్తుండగా రోటరీపురం సమీపంలో కారు అదుపుతప్పింది. కారు రోడ్డు పక్కనున్న హోటల్‌లోకి దూసుకెళ్లి బోల్తా పడటంతో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంలో హరిత అక్కడికక్కడే మృతి చెందారు. నవనీత, వినయ్‌కుమార్, శ్రీధర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నవనీత మృతి చెందారు.

అయితే ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెలను యువకులు మాయమాటలు చెప్పి కారులో తీసుకెళ్లారని, వారిని హత్య చేసి అనంతరం ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఘటన ప్రమాదమా? మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడంతో పాటు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో వెలువడే ఆధారాల ఆధారంగా యువతుల మృతికి అసలు కారణం ఏమిటనేది తేలాల్సి ఉంది.




















