ప్రభుత్వ వైద్యులపై కూటమి సర్కార్ కొరడా..70 మంది డాక్టర్ల తొలగింపు..మరో 193 మందిపై చర్యలు

విధులను నిర్లక్ష్యం చేస్తూ సుదీర్ఘకాలంగా అనధికారికంగా గైర్హాజరవుతున్న ప్రభుత్వ వైద్యులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే 70 మంది వైద్యులను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే తరహాలో గైర్హాజరవుతున్న మరో 193 మందిపై చర్యలు వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

2 అక్టోబర్, 2026 6:31 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ప్రభుత్వ వైద్యులపై కూటమి సర్కార్ కొరడా..70 మంది డాక్టర్ల తొలగింపు..మరో 193 మందిపై చర్యలు

అమరావతి, అక్టోబర్ 2 (జనవాణి): విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైద్యులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. సుదీర్ఘకాలంగా ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతున్న 70 మంది ప్రభుత్వ వైద్యులను ప్రభుత్వం తొలగించింది.

విధులకు హాజరుకాకుండా కొనసాగుతున్న వైద్యులపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి డీఎస్‌హెచ్, డీఎంఈ అధికారులు పూర్తి వివరాలతో కూడిన నివేదికను శుక్రవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు అందజేశారు. నివేదికను పరిశీలించిన మంత్రి 70 మంది వైద్యులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో సుదీర్ఘకాలంగా విధులకు గైర్హాజరవుతున్న మరో 193 మంది వైద్యులపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రక్రియ కొనసాగుతోంది. వీరికి సంబంధించిన చర్యలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వైద్యులు విధులను సక్రమంగా నిర్వహించాల్సిందేనని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. ప్రజలకు అందాల్సిన వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని సూచించారు. కాగా, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఏళ్ల తరబడి విధులకు దూరంగా ఉన్న 51 మంది ప్రభుత్వ వైద్యులను ఈ ఏడాది మేలో ప్రభుత్వం తొలగించింది. తాజాగా మరో 70 మందిపై వేటు వేయడంతో విధులకు గైర్హాజరవుతున్న ప్రభుత్వ వైద్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు