రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు ఉపయోగపడే ప్రతి సూచనను ప్రభుత్వం స్వాగతిస్తుందని, అయితే ప్రభుత్వ చర్యలను విస్మరించి రైతుల్లో ఆందోళన కలిగించే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రైతుల్లో అనవసర ఆందోళనకు దారితీసే అవకాశం ఉందని అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలని ఆయన సూచించారు.
పొగాకు రైతులకు అండగా ప్రభుత్వం
పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం గతంలోనూ, ప్రస్తుతం కూడా కట్టుబడి పనిచేస్తోందని మంత్రి తెలిపారు. 2014–15లో ఎఫ్‌సీవీ పొగాకు ధరలు తీవ్రంగా పడిపోయినప్పుడు రైతులకు కిలోకు అదనంగా రూ.20 చొప్పున ప్రోత్సాహకాన్ని అందించామని గుర్తు చేశారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 11 మిలియన్ కిలోల పొగాకును మాత్రమే కొనుగోలు చేసి బాధ్యత నుంచి తప్పించుకున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు.
రూ.188 కోట్లతో రైతులకు మద్దతు
గత ఏడాది హెచ్‌డీ బర్లీ పొగాకులో 25 మిలియన్ కిలోలను రూ.270 కోట్లతో కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడంతో పాటు పొగాకు కంపెనీలపై ఒత్తిడి తీసుకువచ్చి రైతుల నుంచి కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
పొగాకు రైతులకు కిలోకు రూ.20 చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మొత్తం 94 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేసేందుకు చర్యలు ప్రారంభించాయని తెలిపారు. ఇందుకోసం రూ.188 కోట్లను వెచ్చించే ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రతిరోజూ సీఎం సమీక్ష
పొగాకు రైతుల సమస్యలను ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రతిరోజూ సమీక్షిస్తూ అవసరమైన ఆదేశాలు ఇస్తున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కనిపించడం లేదా అని మాజీ సీఎం జగన్‌ను ప్రశ్నించారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాత్మక సూచనలు చేయాలని, వారిలో మరింత ఆందోళన కలిగించే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని అచ్చెన్నాయుడు సూచించారు.




















