అమరావతి, ఆగస్టు 10 (జనవాణి): ఈనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో ప్రభుత్వ అజెండా, ప్రతిపక్షాల డిమాండ్లను బట్టి అసెంబ్లీ పనిదినాలను అధికారికంగా ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సమావేశాలను నాలుగు రోజుల పాటు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
మంత్రులకు చంద్రబాబు కీలక సూచనలు
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ప్రతిపక్షం లేవనెత్తే ప్రతి అంశంపై స్పష్టమైన సమాధానంతో సిద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. వైసీపీ సభ్యులు అసెంబ్లీ లేదా శాసన మండలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తే, వాస్తవాలతో ధీటుగా సమాధానం ఇవ్వాలని సీఎం సూచించినట్లు సమాచారం. అవసరమైతే ఆయా శాఖాధిపతుల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించుకుని సభకు హాజరు కావాలని మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
ఆరు అంశాలపై చర్చ
ఈ సమావేశాల్లో సుమారు ఆరు కీలక అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన, ఎల్‌నినో ప్రభావం వంటి అంశాలపై ప్రత్యేక చర్చకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు అంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.
వైసీపీ వ్యూహం ఏమిటి?
మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బీసీ రక్షణ చట్టం బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో వైసీపీ సభ్యులు సభకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లా అండ్ ఆర్డర్, సాయిక్రిష్ణ లాకప్ డెత్,మెగా డీఎస్సీ అక్రమాలు, రైతుల సమస్యలు, ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాలతోపాటు ఎన్నికల హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వైసీపీ యోచిస్తోంది.
ప్రతి ప్రశ్నకు సమాధానం ఉండాలి
ప్రతిపక్షం ముఖ్యంగా మెగా డీఎస్సీ, శాంతిభద్రతలు, అక్రమ కేసులు, రైతుల సమస్యలు, ఎన్నికల హామీల అమలు వంటి అంశాలను లేవనెత్తే అవకాశం ఉన్నందున ఆయా అంశాలపై మంత్రులు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు వైసీపీ లేవనెత్తే అంశాలపై ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చి ప్రజలు విశ్వసించేలా సమాధానం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. దీంతో రాబోయే అసెంబ్లీ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది.




















